చిన్నారులకు, వృద్ధులకు సమస్యగా మారిన ఈ-కేవైసీ | Fingerprint Issues Hit Ration E-KYC Enrolment | Sakshi
Sakshi News home page

చిన్నారులకు, వృద్ధులకు సమస్యగా మారిన ఈ-కేవైసీ

Jul 30 2026 9:24 AM | Updated on Jul 30 2026 9:56 AM

Fingerprint Issues Hit Ration E-KYC Enrolment

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

రేషన్‌ ఈ– కేవైసీకి మరో 2 రోజులే..

గడువు పొడిగించాలంటున్న లబ్ధిదారులు

చిన్నారులు, వృద్ధులకే తీవ్ర ఇబ్బందులు

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ ఈ–కేవైసీ నమోదులో చిన్నారులు, వయోవృద్ధులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వయసు పైబడటంతో వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, పిల్లల్లో ముద్రలు సరిగా రాకపోవడంతో ఈ–పాస్‌ యంత్రాలు స్పందించడం లేదు. దీనికి తోడు ఆధార్‌ అప్‌డేషన్‌ లేకపోవడం, రేషన్‌ దుకాణాల్లో ఐరిస్‌ (కంటిపాప) స్కానర్లు అందుబాటులో లేకపోవడంతో బయోమెట్రిక్‌ నమోదు కాక లబ్ధిదారులు కేంద్రాల చుట్టూ అలుపెరగక తిరగాల్సి వస్తోంది.

వాస్తవంగా గత రెండేళ్లుగా సాగుతున్న రేషన్‌ కార్డుల ఈ–కేవైసీ  ప్రక్రియ ముగింపునకు వచ్చింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. తుది గడువు సమీపిస్తుండటంతో ఇంకా ఈ–కేవైసీ పూర్తి చేసుకోని వారు రేషన్‌ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

ఇప్పటికీ 20 శాతం పెండింగ్‌..
మహా నగర పరిధిలోని పాత, కొత్త రేషన్‌ కార్డుదారులు, యూనిట్ల (సభ్యుల) ఈ–కేవైసీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. బయోమెట్రిక్‌ సాంకేతిక సమస్యల కారణంగా అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికీ సుమారు 20 శాతం మంది లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉండిపోయింది.

గడువులోగా ఈ–కేవైసీ పూర్తి కాకపోతే వచ్చే నెల నుంచి ఉచిత రేషన్‌ బియ్యం అందుతాయో లేదో అనే గందరగోళం పేద కుటుంబాల్లో నెలకొంది. ఈ–కేవైసీ లేని సభ్యుల పేర్లను రేషన్‌ కోటా నుంచి తొలగిస్తారనే ప్రచారంతో లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.  ఈ–కేవైసీ సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సడలింపులు ఇచ్చి రేషన్‌ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement