ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను మరింత విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో మరో 100 నగరాలకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. చిన్న కుటుంబాలు, ఒంటరిగా నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, తరచూ నివాసం మారే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురు కొనుగోళ్లలో కూడా బీపీసీఎల్ వైవిధ్యాన్ని పెంచుతోంది. జూన్ త్రైమాసికంలో వెనిజులా, అంగోలా నుంచి దిగుమతులను పెంచగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం ముడి చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 38 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో స్పాట్ కార్గోల ద్వారా కొనుగోళ్లు గత ఏడాది ఇదే కాలంలోని 44 శాతం నుంచి 69 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 3.8 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉండగా, ఇవి సుమారు 35 రోజుల అవసరాలకు సరిపోతాయని వెల్లడించింది. అలాగే మొజాంబిక్ ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టు కార్యకలాపాలు 2029 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీపీసీఎల్ రూ.3,962 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.3,919 కోట్ల లాభం వచ్చినప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం, ఎల్పీజీ విక్రయాల్లో అండర్‌రికవరీలు పెరగడం వల్ల మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ నష్టం మార్కెట్ అంచనా అయిన రూ.12,632 కోట్ల కంటే చాలా తక్కువగా నమోదవడం విశేషం.


