ఇండియా క్లీన్ ఎనర్జీలోకి యాపిల్ ఎంట్రీ | Apple Powers Indias Green Future Rs 100 Cr CleanMax Deal 150 MW Solar Wind Push | Sakshi
Sakshi News home page

ఇండియా క్లీన్ ఎనర్జీ విభాగంలోకి యాపిల్ ఎంట్రీ

May 7 2026 1:01 PM | Updated on May 7 2026 1:09 PM

Apple Powers Indias Green Future Rs 100 Cr CleanMax Deal 150 MW Solar Wind Push

క్లీన్ మ్యాక్స్‌తో రూ.100 కోట్ల భాగస్వామ్యం!

టెక్ దిగ్గజం యాపిల్ తన సుస్థిరత లక్ష్యాల దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంతోపాటు పర్యావరణ హితమైన ఇంధన వనరుల వినియోగంలోనూ అగ్రగామిగా నిలవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ముంబైకి చెందిన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ‘క్లీన్ మ్యాక్స్’తో చేతులు కలిపింది. దాదాపు రూ.100 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ ప్రాజెక్టులను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.

ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి

గతంలో యాపిల్ తన కార్యాలయాలు, రిటైల్ స్టోర్ల కోసం కేవలం రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు పరిమితం కాగా తాజా ఒప్పందం మరింత కీలకంగా మారనుంది. కేవలం విద్యుత్తును కొనుగోలు చేయడం కాకుండా, విద్యుత్ ఉత్పత్తి చేసే ఆస్తుల నిర్మాణంలో నేరుగా మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టడం ఈ డీల్‌లోని ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ 150 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి వస్తే సుమారు 1.5 లక్షల కుటుంబాల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చేంత శక్తి ఉత్పత్తి అవుతుంది.

2030 లక్ష్యం దిశగా ప్రయాణం

2030 నాటికి తన గ్లోబల్ సప్లై చైన్, ఉత్పత్తుల వినియోగం మొత్తాన్ని కార్బన్ న్యూట్రల్‌(వాతావరణంలోకి మనం విడుదల చేసే కార్బన్ ఉద్గారాలను అంతే పరిమాణంలో తిరిగి తొలగించడం)గా మార్చాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు కేవలం ఒక తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారుతోంది.

‘భారతదేశ గ్రీన్‌ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం, దేశంలోని సహజ వనరులను రక్షించడం మాకు గర్వకారణం. మా పర్యావరణ లక్ష్యాలు ఆవిష్కరణలకు చోదకశక్తిగా పనిచేస్తాయి’ అని యాపిల్‌ సప్లై చైన్ ఇన్నోవేషన్, వైస్ ప్రెసిడెంట్ సారా చాండ్లర్ అన్నారు. క్లీన్ మ్యాక్స్ వ్యవస్థాపకుడు కుల్దీప్ జైన్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు నెట్-జీరో భాగస్వామిగా ఉండటమే తమ లక్ష్యమని, యాపిల్ వంటి దిగ్గజంతో పనిచేయడం వల్ల పర్యావరణ వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా?

Advertisement
 
Advertisement
Advertisement