
ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్ అభివృద్ధి
ప్రయోగశాలలో మెరుగైన ఫలితాలు సాధించిన హెచ్‌వైఎల్‌ఈఎన్‌ఆర్
కార్బన్ రహిత విద్యుత్ వ్యవస్థల కోసం ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్ (ఎల్ఈఎన్ఆర్)’ను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించిన క్లీన్ ఎనర్జీ స్టార్టప్ హెచ్‌వైఎల్‌ఈఎన్‌ఆర్ ‘ప్రీ-సిరీస్-ఏ ఫండింగ్ రౌండ్’ను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ రౌండ్‌లో సుమారు 3 మిలియన్ డాలర్ల(రూ.26.39 కోట్లు)ను సమీకరించినట్లు తెలిపింది. డీప్ టెక్, ఎనర్జీ ట్రాన్సిషన్ టెక్నాలజీల్లో ఆసక్తి ఉన్న వేలార్ క్యాపిటల్, చత్తీస్‌గఢ్ ఇన్వెస్టమెంట్స్ లిమిటెడ్ ఈ రౌండ్‌లో పాల్గొన్నాయని కంపెనీ తెలపింది. వీటితోపాటు వ్యక్తిగత ఇన్వెస్టర్లు కార్తీక్ సుందర్ అయ్యర్, అనంత్ సర్దా ఇందులో పాల్గొన్నారని పేర్కొంది.
ఈ నిధులతో గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్ స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎల్‌ఈఎన్‌ఆర్ టెక్నాలజీతో తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేసే ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చని పేర్కొంది. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు బదులుగా లో-ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ (ఎల్‌ఈఎన్‌ఆర్) టెక్నాలజీ ద్వారా రేడియోధార్మిక పదార్థాలు లేకుండా స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్(ఎల్‌ఈఎన్‌ఆర్ టెక్నాలజీతో నడిచే రియాక్టర్)ను హెచ్‌ఐఎల్‌ఈఎన్‌ఆర్ అభివృద్ధి చేసింది.
ఈ ఫండింగ్ రౌండ్‌లో పాల్గొన్న వేలార్ క్యాపిటల్ పార్టనర్ కరణ్ గోషార్ మాట్లాడుతూ..‘హెచ్‌వైఎల్‌ఈఎన్‌ఆర్‌కు చెందిన ఎల్‌ఈఎన్‌ఆర్ టెక్నాలజీ పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడే ఎనర్జీని అందిస్తుంది. ఇది శక్తిని అందించడంతోపాటు అసాధారణమైన భద్రతా కూడా కలిగి ఉంది. ఇది ప్రపంచ శక్తి పరివర్తనకు సరిగ్గా సరిపోతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
హెచ్‌వైఎల్‌ఈఎన్‌ఆర్ ఛైర్మన్, ఎండీ సిద్దార్ధ దురైరాజన్ మాట్లాడుతూ..‘ఇటీవలి ప్రయోగశాల పరిశోధనలు మెరుగైన ఎనర్జీ ఫలితాలు ఇచ్చాయి. ఎల్ఈఎన్ఆర్ వ్యవస్థ ఆచరణీయంతోపాటు చాలా సమర్థవంతంగా ఉంటుంది. మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పరీక్షలను ప్రారంభించాం. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎల్ఈఎన్ఆర్ వ్యవస్థపై ఆసక్తి చూపుతున్నాయి. భవిష్యత్తులో తయారీని విస్తరిస్తాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ బ్రేక్
ఎల్‌ఈఎన్‌ఆర్ (లో-ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్) సాపేక్షంగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే అణు ప్రతిచర్యను నిర్ధారిస్తుంది. ఇది తక్కువ రేడియేషన్‌తో అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హెచ్‌వైఎల్‌ఈఎన్‌ఆర్ 7.2కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ల సామర్థ్యం వరకు పారిశ్రామిక, గృహ ఉపయోగం కోసం పేటెంట్ పొందిన హైబ్రిడ్ హీట్ సిస్టమ్‌లను కలిగి ఉంది.