కీలక వడ్డీ రేట్లు యథాతథం | August 2025 Monetary Policy Committee meeting RBI repo rate updates | Sakshi
Sakshi News home page

RBI Repo Rate Update: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ బ్రేక్‌

Aug 6 2025 10:05 AM | Updated on Aug 6 2025 12:00 PM

August 2025 Monetary Policy Committee meeting RBI repo rate updates

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టు 4న ప్రారంభమైన ఎంపీసీ 6న ముగిసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు.

స్థిరమైన రేట్లకు కారణాలు..

రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 2.1 శాతానికి చేరింది. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు సహా మునుపటి కోతలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్‌బీఐ భావిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో లోన్‌ ఈఎంఐలు ప్రస్తుతానికి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ పూర్వ గవర్నర్‌ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన అనంతరం, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు నాలుగో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్‌లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్‌లోనూ మరో 50 బేసిస్‌ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు 5.5 శాతానికి చేరింది.

ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడు

రెపో రేటు అంటే..

రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్‌ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది. 

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముఖ్యాంశాలు..

  • సీపీఐ ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో 3.1 శాతంగా అంచనా.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా అంచనా.

  • గ్రామీణ వినియోగం నిలకడగా ఉంది.

  • ప్రధాన ద్రవ్యోల్బణం 4 శాతం మార్కును తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement