ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడు | Noida Man Finds 10 01 Duodecillion in Mother Account | Sakshi
Sakshi News home page

ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడు

Aug 5 2025 2:43 PM | Updated on Aug 5 2025 7:19 PM

Noida Man Finds 10 01 Duodecillion in Mother Account

రూ.10,01,35,60,00,00,00,00,01,00,23,56,00,00,00,00,00,00,299 ఏంటి ఇది అని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడి కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌. అవును.. నిజమే. తన ఖాతాలో రూ.1 బిలియన్‌ 13 లక్షల 56 వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బు జమ కావాడాన్ని చూసి ఆ యువకుడే ఆశ్చర్యపోయాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

సచిన్ గుప్తా అనే వ్యక్తి తన ఎక్స్‌ ఖాతాలో చేసిన వివరాల ప్రకారం.. రూ.1 బిలియన్‌ 13 లక్షల 56 వేల కోట్లకుపైగా 20 ఏళ్ల దీపక్‌ ఖాతాలో జమైందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నేను మ్యాథ్స్‌లో వీక్‌. ఇది చదువుతున్నవారు ఈ డబ్బు విలువ ఎంతో చెప్పవచ్చు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తోంది. దీపక్‌ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు’ అని పోస్ట్‌ చేశారు.

మీడియా కథనాల ప్రకారం.. దీపక్‌ తల్లి గాయత్రీదేవీ రెండు నెలల క్రితం మరణించారు. తన తల్లి బ్యాంకు ఖాతాను ప్రస్తుతం 20 ఏళ్ల దీపక్‌ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 3 రాత్రి గాయత్రి ఖాతాలో రూ.1 బిలియన్‌ 13 లక్షల 56 వేల కోట్లకుపైగా నగదు క్రెడిట్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. అయోమయానికి, ఆందోళనకు గురైన దీపక్‌ ఖాతాలో చూపిస్తున్న డబ్బు ఎంతో లెక్కించమని తన స్నేహితులతో ఆ సందేశాన్ని పంచుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం దీపక్ సదరు లావాదేవీని సరిచూసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు బ్యాలెన్స్‌ను ధ్రువీకరించినప్పటికీ అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో డిపాజిట్ కావడంతో ఖాతాను స్తంభింపజేశారు. ఈ విషయాన్ని వెంటనే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయగా, వారు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో దీపక్‌కు బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. హఠాత్తుగా వచ్చిన అటెన్షన్ తట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

ఇదీ చదవండి: బంగారం ధరలు రయ్‌ రయ్‌

ఈ లావాదేవీ సాంకేతిక తప్పిదమా, బ్యాంకింగ్ లోపమా లేక మనీలాండరింగ్ కేసునా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే అసలు వివరాలు తెలుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇది బ్యాంకు లోపం అన్నారు. ‘ఇది సాధ్యం కాదు. బ్యాంకు సాఫ్ట్‌వర్‌లో లోపం లేదా మాన్యువల్ ఎంట్రీ తప్పిదం మాత్రమే’ అని ఒకరు రాశారు. ఈ 20 ఏళ్ల యువకుడు ఇప్పుడు అంబానీ కంటే ధనవంతుడు అని మరొకరు రిప్లై ఇచ్చారు.

స్పందించిన బ్యాంక్
దీపక్ ఖాతాలో లెక్కకు మించిన డబ్బు జమ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ.. కస్టమర్ ఖాతాలో పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ ఉందని వస్తున్న వార్తలు తప్పు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఖాతా వివరాలను తనిఖీ చేసుకోమని కస్టమర్‌లకు చెబుతాము. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని, అన్ని సేవలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement