ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవైపు ఆ భవనాల నీడలోనే మగ్గిపోతున్న రేకుల షెడ్లు. ఒకరికి వేల కోట్ల సంపద ఎలా ఖర్చు చేయాలో తెలియని సందిగ్ధం.. మరొకరికి పూట గడవడానికి కావాల్సిన సరుకులు లేక విచారం. అంకెల్లో చూస్తే అభివృద్ధిలో ప్రపంచంలోనే దేశం పరుగులు పెడుతోంది కానీ, ఆ పరుగులో సామాన్యుడు మాత్రం వెనకబడిపోతున్నాడు. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ బయటపెట్టిన తాజా వాస్తవాలు భారత్‌లో పెరుగుతున్న ఈ అగాధాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇదే ఆర్థిక అసమానతలు కొనసాగితే సామాజిక అశాంతి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఒక భారీ వృక్షంలా ఎదుగుతోంది. కానీ దాని ఫలాలు మాత్రం కొద్దిమందికే అందుతున్నాయి. దేశంలోని 1 శాతం మంది చేతుల్లోనే 40 శాతం సంపద పోగుపడటం అనేది కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల నిస్సహాయతకు సాక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడమేనా? లేక ఆ పెరిగిన సంపద పేదవాడి ఆకలిని తీర్చడమా? ఈ తరుణంలో పెరుగుతున్న అసమానతలపై విశ్లేషణ చూద్దాం.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. జీడీపీ పరంగా మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం.. పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో అంతరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని కేవలం 1 శాతం అత్యంత ధనవంతుల వద్దే 40 శాతం జాతీయ సంపద ఉంది. సంపదపరంగా టాప్‌లో ఉన్న 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతాన్ని పొందుతుండగా, దిగువన ఉన్న 50 శాతం మందికి కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే దక్కుతోంది. ప్రస్తుత ఆదాయ అసమానతలు బ్రిటిష్ పాలన కాలం నాటి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఆర్థిక అసమానతల వల్ల తలెత్తే పరిణామాలు
ఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నేరాలు పెరగడానికి, వర్గ పోరాటాలకు, పౌర అశాంతికి దారితీస్తుంది. మెజారిటీ ప్రజల వద్ద ఆదాయం లేకపోతే వారు నాణ్యమైన విద్య, వైద్యానికి దూరమవుతారు. ఇది దేశ భవిష్యత్తు శ్రామిక శక్తి నాణ్యతను తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే సామాన్యుల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. కేవలం కొద్దిమంది ధనవంతుల ఖర్చుతో దేశ ఆర్థిక చక్రం పూర్తిస్థాయిలో తిరగలేదు. పేదరికం వల్ల మార్కెట్‌లో వస్తువులకు డిమాండ్ తగ్గి, ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. సంపద కేంద్రీకరణ వల్ల రాజకీయ అధికారం కూడా కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుల గొంతుకను నొక్కివేస్తుంది.
నియంత్రించేందుకు మార్గాలు
అత్యంత ధనవంతులపై సంపద పన్ను(Wealth Tax) లేదా వారసత్వ పన్ను (Inheritance Tax) వంటివి విధించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలి.
ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం వల్ల పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది వారిని పేదరికం నుంచి బయటపడేలా చేస్తుంది.
కేవలం కార్పొరేట్ కంపెనీలకే కాకుండా భారీగా ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి.
అసంఘటిత రంగంలోని కార్మికులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు అందేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలి.
ఇప్పటికీ దేశంలో సగం జనాభా ఆధారపడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచవచ్చు.
చివరగా..
ఆర్థిక వృద్ధి అనేది కేవలం అంకెల్లో కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందించినప్పుడే అది సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. భారతదేశం వికసిత్ భారత్‌గా మారాలంటే సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద సమంగా పంపిణీ అయ్యేలా చూడటం అత్యవసరం. లేనిపక్షంలో ఈ ఆర్థిక అసమానతలు దేశ సుస్థిరతకు ముప్పుగా మారతాయని గమనించాలి.
ఇదీ చదవండి: ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?


