ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు? | india legalframework to control ai and deepfakes | Sakshi
Sakshi News home page

ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?

Dec 19 2025 11:00 AM | Updated on Dec 19 2025 11:00 AM

india legalframework to control ai and deepfakes

ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక విప్లవంలా దూసుకుపోతోంది. పనులను సులభతరం చేస్తూనే, మరోవైపు డేటా గోప్యత, డీప్‌ఫేక్స్ వంటి రూపాల్లో సరికొత్త సవాళ్లను విసురుతోంది. సాంకేతికత అందించే ఫలాలను అందుకుంటూనే, దానివల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో ఏఐని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన చట్రం, తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భారత్‌లో ఏఐ నియంత్రణ

భారతదేశంలో ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేకమైన ఏకీకృత చట్టం లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం వివిధ ప్రస్తుత చట్టాలు, కొత్త మార్గదర్శకాల ద్వారా ఏఐ వినియోగాన్ని నియంత్రిస్తోంది. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందడానికి, పనిచేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ఈ డేటాను ఎలా సేకరించాలి, ఎలా వాడాలి అనే అంశాలను డిజిటల్ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం (DPDP Act), 2023 నియంత్రిస్తుంది. ఏఐ మోడల్స్ వ్యక్తిగత డేటాను ఉపయోగించే ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం డేటా ఉల్లంఘనలు జరిగితే ఏఐ సంస్థలపై భారీ జరిమానాలు (రూ. 250 కోట్ల వరకు) విధించే అవకాశం ఉంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000, 2025 సవరణలు

ప్రస్తుతానికి ఐటీ చట్టమే డిజిటల్ రంగంలో ప్రాథమిక చట్టంగా ఉంది. 2025లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. తప్పుదోవ పట్టించే ఏఐ కంటెంట్ లేదా డీప్‌ఫేక్స్‌ను నిరోధించే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లదే. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం తప్పనిసరి.

ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు 2025

నవంబర్ 2025లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అధిక రిస్క్ ఉన్న ఏఐ అప్లికేషన్లపై కఠినమైన నిఘా అవసరం. స్టార్టప్‌లు ఏఐ సాంకేతికతను సురక్షితమైన వాతావరణంలో పరీక్షించుకునేలా ప్రోత్సహించాలి.

బ్యాంకింగ్ రంగంలో ఏఐ వాడకంపై ఆర్‌బీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా లోన్ అప్రూవల్స్ వంటి వాటిలో ఏఐ వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.

ప్రస్తుత చట్టాలు ఏఐకి పూర్తిస్థాయిలో సరిపోవని నిపుణుల అభిప్రాయం. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకోకుండానే ప్రజా భద్రత, గోప్యతను కాపాడటం అనే సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ కోసం మరింత సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్‌ 10 రిచ్‌ ఫ్యామిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement