లక్ష కిలోమీటర్లు.. మనిషి శరీరంలోని చిన్నా పెద్దా నరాల పొడవు ఇది!. ప్రమాదం కొద్దో లేక ఇంకో కారణంతోనో ఈ నరాలు తెగాయి అనుకోండి. అతుకుపెట్టడం చాలా కష్టం. ఒకవేళ పెట్టినా అవి మునుపటిలా పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. నరాలు సరిగ్గా అతుక్కోకపోతే స్పర్శజ్ఞానం పోవచ్చు. లేదంటే విపరీతమైన నొప్పి బాధపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం లాంటి విపరీత సమస్య కూడా ఎదురు కావచ్చు. అయితే..
ఇకపై ఈ సమస్యలు చాలావరకూ లేకుండా పోతాయి. ఎందుకంటారా? అమెరికాలోని ఓ కంపెనీ తెగిన నాడులను సరిగ్గా అతుకుపెట్టేందుకు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది మరి!. తెగిన నరాలను వైద్యులు ఇప్పటివరకూ కుట్లు వేయడం ద్వారా మాత్రమే జత చేస్తున్నారు. చాలా సూక్ష్మమైన నరాల విషయానికి వచ్చినప్పుడు మైక్రోస్కోపుల్లో చూసుకుంటూ కుట్లు వేస్తూంటారు. ఫలితంగా నాడుల్లో సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు టిసియం అనే సంస్థ ‘కోఆప్టియమ్ కనెక్ట్’ పేరుతో ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
కొత్త టెక్నాలజీలో కుట్లు వేయడం అన్నది ఉండనే ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన ఒక చిన్న గొట్టం లాంటిది తయారు చేస్తారు. రెండుపక్కల తెగిన నరాలను జొప్పించి దగ్గరకు తీసుకొస్తారు. ఆ తరువాత గొట్టానికి రెండు చివర్లలో ప్రత్యేకమైన బయో ప్లాస్టిక్ జిగురులాంటిది వేసి సీల్ చేస్తారు. అంతే.. తెగిన నరాల భాగాలు రెండూ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. సహజసిద్ధంగా కలిసిపోతాయి. కొంత సమయం తరువాత గొట్టం, బయో ప్లాస్టిక్ కూడా నిరపాయకరంగా శరీరంలోకి కలిసిపోతాయి.
వాస్తవానికి ఈ టెక్నాలజీని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంతో కాలం క్రితమే అభివృద్ధి చేసింది. జెఫ్రీ కార్ప్ అండ్ బాబ్ లాంగర్స్ ల్యాబ్‌లో దీనిపై ప్రయోగాలూ జరిగాయి. విజయవంతమయ్యాయి కూడా. ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత నాడుల పనితీరు పూర్వ స్థితికి చేరుకోవడమే కాకుండా.. కనీసం ఏడాది పాటు ఎలాంటి నొప్పి కూడా కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..

ఈ చికిత్స కేవలం నాడులకు మాత్రమే పరిమతం కాకపోవడం. శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చే హెర్నియాతోపాటు గుండె కణజాలం అభివృద్ధి వరకూ వేర్వేరు చోట్ల వాడుకునే అవకాశం ఉంది. టిసియం సంస్థ అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. గుండె, హెర్నియా తదితర విషయాలకు సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది.
:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా


