విక్రయించేందుకు అమెరికా అంగీకారం
తమ భద్రతకు ముప్పంటూ చైనా అభ్యంతరం
ఏక చైనా విధానాన్ని తుంగలో తొక్కిందని ఆగ్రహం
వాషింగ్టన్/బీజింగ్: చైనాతో టారిఫ్‌ల యుద్ధం ఓ వైపు కొనసాగిస్తూనే, మరో వైపు తైవాన్‌కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది. ఏకంగా రూ.1 లక్షా 188 కోట్లు(11.1 బిలియన్ డాలర్లు) విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్..విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గానీ, చైనా, తైవాన్‌ల గురించి గానీ ప్రస్తావించలేదు. ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో.. తైవాన్‌కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది.
తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన 8 ఒప్పందాల్లో 82 హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ వ్యవస్థలు(హైమార్స్), 420 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(అట్‌కామ్స్), 60 సెల్ఫ్ ప్రొపెల్డ్ హొవిట్జర్ వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా.. ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికా–చైనాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉప్పూనిప్పుగా సంబంధాలు కొనసాగుతున్న వేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడిచిందని, తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది.


