వీసా గడువు తేదీతో సంబంధం లేదంటూ అమెరికా కొత్త మెలిక
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది.
ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు.
అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్‌టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్‌వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్‌టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్‌వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్‌టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.


