ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో ప్రధాని మోదీ భేటీ
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చ
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం
ఇదొక నూతన, సువర్ణ అధ్యాయం అని ఉద్ఘాటన
పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, ఒమన్
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు అల్ బకారా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి సుల్తాన్ ఘనంగా స్వాగతం పలికారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత పట్ల తమ అంకితభావాన్ని ప్రకటించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వెనుక సుల్తాన్ కృషి దాగి ఉందని మోదీ కొనియాడారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఒప్పందం ఇరుదేశాల సంబంధాల్లో నూతన, సువర్ణ అధ్యాయం అని అభివరి్ణంచారు. రెండుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంచడంపై ఒమన్ సుల్తాన్‌తో చర్చించినట్లు తెలిపారు. ఇంధనం, అరుదైన ఖనిజాలు, వ్యవసాయం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు.
భారత్–ఒమన్ వాణిజ్యం 10 బిలియన్ డాలర్లు దాటడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇంధన రంగాల్లో ఒప్పందాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులపై మోదీ, సుల్తాన్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు భారత్, ఒమన్ మధ్య ప్రతినిధుల స్థాయిలోనూ చర్చలు జరిగాయి. మరోవైపు, మారిటైమ్ హెరిటేజ్, మ్యూజియమ్స్, వ్యవసాయం–అనుబంధ రంగాలు, ఉన్నత విద్యకు సంబంధించిన పలు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) భారత్, ఒమన్ సంతకాలు చేశాయి.
ద్వైపాక్షిక సంబంధాలకు నూతన శక్తి
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)తో 21వ శతాబ్దంలో భారత్, ఒమన్ సంబంధాలకు నూతన శక్తి, విశ్వాసం సమకూరుతాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మస్కట్‌లో ఇండియా–ఒమన్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. దీని ప్రభావం రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఉంటుందని అన్నారు. ప్రగతిశీలం, స్వయం చోదకమే భారత్ స్వభావం అని వ్యాఖ్యానించారు.
భారత్ అభివృద్ధి సాధిస్తే తమ మిత్రదేశాలు సైతం అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని, దీనివల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుందని వివరించారు. అంతకంటే ఎక్కువగా ఒమన్‌కు లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ఒమన్ తమకు సన్నిహిత మిత్రదేశమని గుర్తుచేశారు. భారతదేశ ప్రగతి చరిత్రలో భాగస్వాములుగా మారాలని ఒమన్ కంపెనీలకు మోదీ పిలుపునిచ్చారు. ఇండియాలో కీలక రంగాల్లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో ముందుకు రావాలని సూచించారు.
ప్రపంచానికి మన దీపం వెలుగులు
21వ శతాబ్దంలో భారత్ భారీ నిర్ణయాలు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని, గడువులోగా ఫలితాలు సాధిస్తోందని చెప్పారు. మోదీ మస్కట్‌లో ‘మైత్రి పర్వ్’ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులు, ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. వారిని ‘మినీ–ఇండియా’గా అభివరి్ణంచారు. మనమంతా ఒకే కుటుంబమని, టీమ్ ఇండియా అని వ్యాఖ్యానించారు.
భారతదేశ సంస్కృతికి వైవిధ్యమే పునాది అని స్పష్టంచేశారు. కలిసి జీవించడం, పరస్పరం సహకరించుకోవడం ప్రవాస భారతీయుల హాల్‌మార్క్ అని ప్రశంసించారు. ఇండియా సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావించారు. దేశంలో 8 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదవుతోందని హర్షం వ్యక్తంచేశారు. ఒకవైపు ప్రపంచ దేశాలు సంక్షోభంలో చిక్కుకోగా, ఇండియా ప్రగతి ప్రయాణం మాత్రం ఎక్కడా ఆగడం లేదన్నారు. ఇండియా–ఒమన్ సంబంధాలకు విజ్ఞానమే మూలకేంద్రమని చెప్పారు.
రాబోయే 50 ఏళ్లపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. పెద్ద కలలు కనాలని, విజ్ఞానం పెంచుకోవాలని, మానవాళి బాగు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగను కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని ‘యునెస్కో’ ఇటీవల నిర్ణయించిందని ప్రధానమంత్రి తెలియజేశారు. మన దీపం మన ఇంటికే కాకుండా మొత్తం ప్రపంచానికి వెలుగులు పంచుతోందని పేర్కొన్నారు. ఇండియా అంటే కేవలం మార్కెట్ కాదని.. ప్రపంచానికి ఒక మోడల్ అని మోదీ తేలి్చచెప్పారు.
మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ ప్రదానం
ఒమన్ ప్రభుత్వం తమ విశిష్ట పౌర గుర్తింపు గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. భారత్–ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడానికి తన వంతు పాత్ర పోషించడంతోపాటు అద్భుతమైన నాయకత్వ పటిమ ప్రదర్శిస్తున్నందుకు ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్ ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను స్వీకరించడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఒమన్ సుల్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల ప్రజల మధ్య విశ్వాసం, ఆప్యాయతలకు ఈ గౌరవం ఒక ప్రతీక అని పేర్కొన్నారు. శతాబ్దాలుగా భారత్, ఒమన్ బంధానికి బాటలు వేసిన సముద్ర ప్రయాణికులకు ఆయన ఈ పురస్కారాన్ని అంకితం ఇచ్చారు.


