ఇథియోపియాకు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లే..
కీలక రంగాల్లో రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు
ఇథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగం
అడిస్ అబాబా: ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానంలో భారత్, ఇథియోపియాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ శాంతి, సమానత్వం, ప్రగతి కోసం రెండు దేశాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని ఉద్ఘాటించారు. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం మంగళవారం ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం దేశ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు.
‘తేనా ఇస్టిలిన్ సలామ్’ అంటూ స్థానిక భాషలో ఎంపీలకు అభివాదం చేశారు. సింహాల గడ్డగా ప్రసిద్ధి చెందిన ఇథియోపియాలో అడుగుపెట్టడం అద్భుతంగా ఉందన్నారు. ఇక్కడికి వస్తే సొంత ఇంటికి వచ్చినట్లే ఉంటుందని, తన సొంత రాష్ట్రం గుజరాత్ కూడా సింహాలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ ప్రసంగించిన విదేశీ పార్లమెంట్లలో ఇది 18వ పార్లమెంట్ కావడం విశేషం. ఆయన మాట్లాడుతుండగా ఇథియోపియా ఎంపీలు 50 సార్లకుపైగా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తంచేశారు.
శుభాకాంక్షలు మోసుకొచ్చా..
‘‘ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా కీలక స్థానంలో ఉంది. హిందూ మహాసముద్రంలో భారత్ హృదయ స్థానంలో నిలిచింది. ఇరుదేశాలు సహజ భాగస్వామ్య దేశాలు. ఈ ఏడాది కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందంతో పరస్పర భద్రత పట్ల అంకితభావం మరింత బలపడింది. భారత్, ఇథియోపియాలు ఒక కుటుంబంగా కలిసి ఉంటున్నాయి.
ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ప్రపంచ సౌభాగ్యం కోసం కృషి చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌కు అండగా నిలిచినందుకు ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉగ్రవాదంపై అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశాలయంలో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల తరఫున శుభాకాంక్షలు మోసుకొచ్చా.
జన్మభూమి మన కన్నతల్లి
ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఇథియోపియా కూడా ఒకటి. ఇది పాత, కొత్తల సమ్మేళనం. ఇక్కడ ప్రాచీన విజ్ఞానం, ఆధునిక ఆకాంక్షల మధ్య సమతూకం కనిపిస్తోంది. ఇదే ఇథియోపియా అసలైన బలం. భారతదేశ నాగరికత అత్యంత ప్రాచీనమైనది. పూర్తి ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులోకి అడుగులు వేస్తోంది. భారత జాతీయ గీతం, ఇథియోపియా జాతీయ గేయం ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి.
జన్మభూమిని కన్నతల్లిగా సంబోధిస్తున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, జన్మభూమిని కాపాడుకొనే విషయంలో అవే మనకు స్ఫూర్తిదాయకం. ఇథియోపియా అభివృద్ధిలో వేలాది మంది భారతీయ ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం పరస్పరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వ్యవసాయమే మనకు వెన్నుముక. మెరుగైన విత్తనాలు, సాగునీటి సరఫరా విధానాలు, భూమిలో సారం పెంచడంపై మనం దృష్టి పెట్టాలి. కలిసికట్టుగా పనిచేయాలి.
ప్రజాస్వామ్యం జీవన విధానం
ఇథియోపియాలోని కీలక రంగాల్లో భారతీయ కంపెనీలు 5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టాయి. దీంతో స్థానికంగా 75 వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఆ దశగానే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించాం. దీనివల్ల టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, మైనింగ్, క్లీన్ ఎనర్జీ, ఆహార భద్రత వంటి రంగాల్లో రెండుదేశాల బంధం బలపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుంది.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో మేము సాధించిన నైపుణ్యాలు, అనుభవాన్ని ఇథియోపియాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్, ఇథియోపియాలు నిఖార్సెన ప్రజాస్వామ్య దేశాలు. ప్రజాస్వామ్యం మన జీవన విధానం. ఇదొక ప్రయాణం. తేనీరు అంటే నాకు ఇష్టం. ఇథియోపియన్ కాఫీ, ఇండియన్ టీ తరహాలోనే మన స్నేహం చక్కటి పరిమళాలు వెదజల్లుతోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఇథియోపియా ఎంపీలు మోదీకి ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. పలువురు మంత్రులు, ఎంపీలతో మోదీ మాట్లాడారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఇథియోపియా పార్లమెంట్ ప్రాంగణంలో మొక్క నాటారు.
మోదీకి అత్యున్నత పౌర పురస్కారం
ఇథియోపియా ప్రభుత్వం భారత ప్రధాని మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిశాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రదానం చేసింది. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి విదేశీ నాయకుడు మోదీ కావడం గమనార్హం. ఆయనను ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాయి.
మంత్రముగ్ధులను చేసిన ‘వందేమాతరం’
ప్రధాని మోదీ గౌరవార్థం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముగ్గురు ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ను శ్రుతిబద్ధంగా ఆలపించారు. ప్రధాని మోదీ సహా భారత ప్రతినిధులు ముగ్ధులయ్యారు. చప్పట్లతో అభినందించారు. ఇథియోపియా గాయకుల ఆలాపన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసిస్తూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సంబంధిత వీడియోను సైతం షేర్ చేశారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సమయంలోనే ఈ గీతాన్ని ఇథియోపియా గాయకుల నోటి వెంట వినడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.


