ఢిల్లీలోని హుమాయున్ దర్వాజా వద్ద అడిడాస్ ఫొటో షూట్‌లో నిఖత్ జరీన్, నిశాద్ కుమార్, రోడ్రిగో పాల్, మెస్సీ, కుల్దీప్ యాదవ్, సుమిత్ అంటిల్, రేణుక సింగ్
ఈ పర్యటన, మీ ఆదరణ అద్భుతం
ఏదో రకంగా భారత్‌కు మళ్లీ వస్తానన్న అర్జెంటీనా దిగ్గజం
న్యూఢిల్లీ: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ అన్నాడు. ‘మీ ఆదరణ, మీరు పంచిన ప్రేమాభిమానాలను నాతోపాటు తీసుకెళ్తున్నా. మ్యాచ్ ఆడేందుకైనా... మరో కార్యక్రమానికైనా ఇంకోసారి భారత్‌కు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనైతే నాకుంది’ అని మెస్సీ అన్నాడు. తను సందర్శించిన ప్రాంతాల్ని, కలుసుకున్న భారత దిగ్గజాలతో ఉన్న ఒక నిమిషం నిడివిగల వీడియోను మెస్సీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నాడు.
ఈ వీడియోలో భారత ప్రముఖ క్రీడాకారులు, సినీ స్టార్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులెందరో ఉన్నారు. కానీ... హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీలతో ఉన్న ఫుటేజీ మాత్రం క్షణమైనా కనిపించలేదు. భారత్‌లో తన ఐదు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నాడు. బుధవారం ముంబై నుంచే మయామికి బయలుదేరాడు.
38 ఏళ్ల అర్జెంటీనా స్ట్రయికర్ తన మయామి క్లబ్ జట్టు సహచరులు స్వారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చాడు. అయితే మరో రెండు రోజులు పొడిగించాడు. భారత్‌లోని వివిధ రంగాల ప్రముఖులను, క్రికెట్, ఫుట్‌బాల్, సినీ స్టార్లను కలుసుకున్నాడు. ముంబైలో సచిన్, మెస్సీల భేటీ వాంఖెడే మైదానానికే వన్నె తెచ్చింది.
బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, కరీనా కపూర్, భారత ఫుట్‌బాల్ మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తదితరులు మెస్సీని కలిసిన వారిలో ఉన్నారు. మంగళవారం దేశీ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ యాజమాన్యం వంతారాలో అచ్చెరువొందే సదుపాయాలతో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షిత ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ... మెస్సీకి ఆత్మీయ స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు.
ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్ నిర్వహించిన ఫొటో షూట్‌లోనూ పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్‌లో మెస్సీతోపాటు తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రేణుక సింగ్, పారాథ్లెట్స్ నిశాద్ కుమార్, సుమింత్ అంటిల్ పాల్గొన్నారు.


