ఆస్ట్రేలియా 326/8
రాణించిన ఉస్మాన్ ఖ్వాజా
కామెరాన్ గ్రీన్ ‘డకౌట్’
ఇంగ్లండ్‌తో ‘యాషెస్’ మూడో టెస్టు
అడిలైడ్: వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆ్రస్టేలియా... సిరీస్ చేజిక్కించుకునే దిశగా కీలక పోరులోనూ మంచి ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా... బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
అలెక్స్ కేరీ ‘శత’క్కొట్టగా... ఉస్మాన్ ఖ్వాజా (126 బంతుల్లో 82; 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా... టాస్ వేయడానికి 45 నిమిషాల ముందు స్టీవ్ స్మిత్ అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వెల్లడించింది.
ఐపీఎల్–2026 మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
కేరీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్
బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారీ జన సందోహం మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో జేక్ వెదరాల్డ్ (18)ను ఆర్చర్ అవుట్ చేయగా... మరుసటి ఓవర్‌లో ట్రావిస్ హెడ్ (10) కూడా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన హెడ్‌ను కార్స్ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో లబుషేన్ (19)తో కలిసి ఉస్మాన్ ఖ్వాజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.
స్మిత్ గైర్హాజరీతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా చక్కటి షాట్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే లంచ్ అనంతరం ఆర్చర్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి మరోసారి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అతడి ధాటికి లబుషేన్, హెడ్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ 94/4తో నిలిచింది. ఈ దశలో అడిలైడ్ ‘లోకల్ బాయ్’ కేరీ గొప్ప సంయమనం కనబర్చాడు. మరో ఎండ్‌లో ఖ్వాజా కూడా పట్టువదలకుండా ప్రయతి్నంచాడు. ఈ జంట ఐదో వికెట్‌కు 91 పరుగులు జత చేసింది.
తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 56,298 మంది అభిమానులు హాజరయ్యారు. అడిలైడ్ మైదానంలో ఇదే అత్యధికం. ‘ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు తరలి రావడం అద్భుతంగా ఉంది. సొంత మైదానంలో 56 వేల పైచిలుకు జనం ముందు సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకం’ అని కేరీ అన్నాడు. జోష్ ఇన్‌గ్లిస్‌తో ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించిన కేరీ... ఎనిమిదో వికెట్‌కు మిచెల్ స్టార్క్ (63 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి 50 పరుగులు జోడించాడు.
135 బంతుల్లో ‘యాషెస్ సిరీస్’ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న కేరీ... కాసేపటికే పెవిలియన్ చేరాడు. స్టార్క్‌తో పాటు లయన్ (18 బంతుల్లో 0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు అడిలైడ్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా... నేడు మరింత ఎండ తీవ్రత ఉండనుంది. సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్‌లతో బరిలోకి దిగారు.


