తొలి మ్యాచ్‌లో గెలిచిన సాత్విక్–చిరాగ్ జోడీ
హాంగ్జౌ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం మొదలైన ఈ టోర్నీలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్న వాళ్లుమాత్రమే పాల్గొనేందుకు అర్హులు. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
భారత్ నుంచి పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించింది. గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 12–21, 22–20, 21–14తో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా)పై విజయం సాధించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్ ద్వయం ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గింది.
అయితే రెండో గేమ్‌లో భారత జోడీ పుంజుకుంది. 18–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో చైనా జంట అనూహ్యంగా విజృంభించి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 19–18తో ఆధిక్యంలోకి వచ్చిం ది. ఆ తర్వాత 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. మరో పాయింట్ కోల్పోతే ఓడిపోయే స్థితిలో సాత్విక్–చిరాగ్ ద్వయం ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది.
నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 7–9తో వెనుకబడిన సాత్విక్–చిరాగ్ జంట తమ లోపాలను వెంటనే సరిచేసుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 12–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జోడీ విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) జంటతో ల్ఫిసాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది.


