
షెన్‌జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ ఆ దిశగా మరో అడుగు వేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–14, 21–14తో రెన్ జియాంగ్ యు–జియె హావోనన్ (చైనా) జోడీపై విజయం సాధించింది.
38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ భారత జోడీ ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో సాత్విక్–చిరాగ్ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 4–11తో వెనుకంజలో ఉంది.
సింధు ఎనిమిదో‘సారీ’
మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 14–21, 13–21తో పరాజయం పాలైంది.
ఆన్ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదిసార్లూ సింధు ఓడిపోవడం గమనార్హం. ఈ కొరియా స్టార్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 6,875 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 6050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.