పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో హిట్‌.. టెస్ట్‌ల్లో ఫట్‌..! | How team india fared in test, odis and t20s in 2025 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది భారత క్రికెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఇవే..!

Dec 21 2025 9:43 PM | Updated on Dec 21 2025 9:56 PM

How team india fared in test, odis and t20s in 2025

2025.. భారత పురుషుల క్రికెట్‌కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం​. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్‌ క్రికెట్‌లో చతికిలబడిన భారత్‌.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.

షాకిచ్చిన దిగ్గజాలు
ఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అప్పటికే (2024 టీ20 వరల్డ్‌కప్‌ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్‌ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్‌ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్‌. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్‌, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్‌ల్లో భారత్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది.  

టెస్ట్‌ల నుంచి వైదొలుగుతూనే రోహిత్‌ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.

గిల్‌ జమానా షురూ
దీంతో టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ శకం మొదలైంది. అయితే రోహిత్‌, కోహ్లి గైర్హాజరీలో గిల్‌కు టెస్ట్‌ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్‌ కెప్టెన్‌గా తొలి పర్యటనలో గిల్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 

 

చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్‌లో గిల్‌ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.

5 మ్యాచ్‌ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్‌ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్‌ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌, పంత్‌, జైస్వాల్‌, సుందర్‌, సిరాజ్‌, బుమ్రా, ఆకాశదీప్‌ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్‌, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.

ఓటమితో ప్రారంభం
2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో (బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్ట్‌ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్‌ ఇదే.

విండీస్‌ను క్లీన్‌ స్వీప్‌
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ సిరీస్‌లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్‌ స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

సొంతగడ్డపై పరాభవం
ఈ ఏడాది భారత్‌కు టెస్ట్‌ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్‌గా చూస్తే, ఈ ఏడాది భారత్‌కు విండీస్‌పై మినహా ఒక్క టెస్ట్‌ సిరీస్‌ విజయం కూడా దక్కలేదు.

వన్డేల్లో తిరుగలేని భారత్‌
ఈ ఏడాది భారత్‌ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.

మూడోసారి ఛాంపియన్‌
అనంతరం జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఆసీస్‌ చేతిలో భంగపాటు
ఈ ఏడాది ఇంగ్లండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి, అనంతరం ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

రెచ్చిపోయిన రోహిత్‌.. నిరాశపరిచిన కోహ్లి
ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ, హాఫ్‌ సెంచరీతో అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. విరాట్‌ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలు
ఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్‌లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్‌ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. 

తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌ను ఘనంగా ముగించింది. ఆసీస్‌తో సిరీస్‌ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాపై సిరీస్‌ విజయాలతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.

పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని భారత్‌  
పొట్టి ఫార్మాట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

ఈ మధ్యలో భారత్‌ ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్‌ను (ఫైనల్‌ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. 

అలాగే టైటిల్‌ గెలిచాక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు బాస్‌గా ఉన్న పాకిస్తానీ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

ఆసియా కప్‌ తర్వాత భారత్‌ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్‌ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా నిలిచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement