న్యూఢిల్లీ: భారత షట్లర్లు బాగానే రాణిస్తున్నారని, అయితే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్థాయికి తగ్గ శారీరక ఫిట్‌నెస్‌ను ఇంకాస్త మెరుగుపరుచుకోవాలని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ (Saina Nehwal) సూచించింది. ప్రత్యర్థుల్ని ఓడించే సత్తా మన ఆటగాళ్లకు ఉందని కావాల్సిందల్లా శారీరక దృఢత్వమేనని చెప్పింది. సింగిల్స్‌లో భారత ఆశాకిరణం లక్ష్యసేన్ అని చెప్పింది.
పాతవారిని మార్చాలి
సైనా నెహ్వాల్ మాట్లాడుతూ తరచూ గాయాలపాలవడం, అమ్మాయిల్లో దూకుడు లోపించడం, ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మరింత సుకుమారంగా మారడంపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచింది.
‘మునుపటిలా రాణించాలంటే మనం మరింత నిలకడ సాధించాలి. సాత్విక్–చిరాగ్ జోడీ, లక్ష్యసేన్, సింధు లేదంటే తర్వాతి తరం ఆటగాళ్లెవరైనా సరే ఫిట్‌నెస్‌కు మరింత ప్రాధాన్యమివ్వాలి.
అప్పుడే ఆటలో స్థిరమైన ఫలితాలు సాధించగలం. దీనికోసం మన షట్లర్లు ముందుగా నిష్ణాతులైన కోచ్‌లు, సుశిక్షితులైన ఫిజియోల్ని ఎంచుకోవాలి. అనువైన, అవసరమైన కోచ్‌లు దొరికేవరకూ అన్వేషిస్తూనే ఉండాలి. కచ్చితంగా పాతవారిని మార్చాలి.
అప్పుడే వరుసగా టోర్నీలు ఆడేందుకు, టైటిల్స్ గెలిచేందుకు ఫిట్‌నెస్ స్థాయిల్ని అమాంతం పెరిగేందుకు దోహదపడతాయి’ అని పేర్కొంది. అంతర్జాతీయ చాంపియన్లు విక్టర్ అక్సెల్సన్, కరోలినా మారిన్‌లు అదే చేశారని, మేటి కోచ్‌లు, ఫిజియోల కోసం పదే పదే ఫిట్‌నెస్, మెంటల్ కండీషనింగ్ కోచ్‌లను మార్చారని సైనా గుర్తు చేశారు.
సింధు గురించి సైనా మాటల్లో..
‘‘శరీరం సహకరించినంత వరకు అంతా బాగుంటుంది. కానీ ఒక్కోసారి శరీరం మనసు మాట వినదు. మనమేమీ యంత్రాలం కాదు కదా!.. చాలా ఏళ్లుగా సింధు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటోంది. తను ఎప్పుడూ తీవ్రమైన గాయాలబారిన పడలేదు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సహకరించకపోవచ్చు.
తనొక అద్భుతమైన ప్లేయర్. టోర్నీల్లో ఎలా గెలవాలో తనకు తెలుసు. అయితే, ముందుగా చెప్పినట్లు ఒక్కోసారి ఫిట్‌నెస్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒకవేళ సింధు గనుక వాటిని అధిగమిస్తే మున్ముందు ఇంకా గొప్పగా ఆడుతుంది’’ అని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చింది.


