భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, జమ్మూ అండ్ కశ్మీర్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ దార్ విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న (జనవరి 8) హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన దార్.. సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ అండ్ కశ్మీర్ 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
ఈ దశ బరిలోకి దిగిన దార్ సుడిగాలి శతకం బాది తన జట్టును గెలిపించాడు. 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఎండ్ నుంచి విన్ష్‌రాజ్ శర్మ (69 నాటౌట్) అద్భుతంగా సహకరించాడు.
వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 182 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో దార్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. అమన్ రావ్ (60), రాహుల్ సింగ్ (56), నితేశ్ రెడ్డి (54 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో దార్ 3, ఆబిద్ ముస్తాక్ 2, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వన్ష్‌రాజ్ శర్మ, సాహిల్ లోత్రా తలో వికెట్ తీశారు. అనంతరం 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ కశ్మీర్ ఓటమి దిశగా సాగినప్పటికీ.. దార్ సూపర్ సెంచరీ కారణంగా అనూహ్యంగా పుంజుకొని చిరస్మరణీయ విజయం సాధించింది.


