2025లో అంతర్జాతీయ వేదికపై భారత్ క్రీడలకు మిశ్రమ ఫలితాలు
పురుషుల హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ ప్రతీ సంవత్సరం తరహాలోనే ‘సమ్’తృప్తిని పంచాయి. చెస్‌లో మహిళల వరల్డ్ కప్ టైటిల్‌తో కాస్త అదనపు ఆనందం దక్కితే, ఆర్చరీ, బాక్సింగ్‌లలో ఫర్వాలేదనిపించే ఫలితాలు వచ్చాయి. ఫుట్‌బాల్, టెన్నిస్ ఎప్పటిలాగే నిరాశను పంచితే... వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త తరం విజయాలు అందించలేకపోయింది.
నీరజ్ చోప్రా తన స్థాయికి తగినట్లు పతకం తేలేక ప్రపంచ వేదికపై నిరాశ పర్చడం అనూహ్య ప్రదర్శనగా మిగిలిపోయింది. 2025లో క్రికెటేతర క్రీడల్లో భారత ఆటగాళ్లు అటు టీమ్ ఈవెంట్లలో, ఇటు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ మిశ్రమ ప్రదర్శన కనబర్చారు. ప్రపంచ వేదికపై ఓ ఆటగాడిని శిఖరాన నిలిపే అసాధారణ ప్రదర్శన లేదా అద్భుత క్షణాలు మాత్రం చెప్పుకోదగ్గవి ఏవీ రాలేదు. ఈ ఏడాది భిన్న క్రీడాంశాల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షిస్తే...
ఆర్చరీ: భారత్‌కు సంబంధించి ఆర్చరీలో ఈ ఏడాది గుర్తుంచుకోదగ్గ విధంగా సాగింది. నాలుగు ప్రపంచకప్‌లలో కలిపి భారత ఆర్చర్లు మొత్తం 15 పతకాలు గెలుచుకున్నారు. 2025 ప్రపంచ కప్ పతకాల పట్టికను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం గెలుచుకుంది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 10 పతకాలతో అగ్రస్థానం సాధించడం విశేషం. వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో శీతల్ దేవి స్వర్ణంతో మెరిసింది.
ఫుట్‌బాల్: భారత ఫుట్‌బాల్ చరిత్రలో మరో చెత్త సంవత్సరంగా ఇది మిగిలిపోనుంది. అతి చిన్న జట్ల చేతుల్లో ఓడిపోవడంతోపాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత దిగువకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 127వ ర్యాంక్‌లో ఉన్న టీమ్ చివరకు వచ్చేసరికి 142వ ర్యాంక్‌తో ముగించింది.
మహిళల జట్టు కొంత మెరుగ్గా ఆడటం విశేషం. క్వాలిఫికేషన్ టోర్నమెంట్ గెలవడం ద్వారా 2026 ఆసియా కప్‌కు భారత మహిళలు అర్హత సాధించారు.
రెజ్లింగ్: 2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏకైక పతకాన్ని గెలుచుకుంది. మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ ఆ ఘనతను సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో మన దేశం 10 పతకాలు గెలుచుకుంది. తాను రిటైర్మెంట్‌ను వీడి మళ్లీ రెజ్లింగ్ బరిలోకి దిగుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఏడాది చివర్లో ప్రకటించింది. సీనియర్లతో పోలిస్తే ప్రపంచ అండర్–20, అండర్–23 ఈవెంట్లలో మన రెజ్లర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చి భవిష్యత్తుపై ఆశలు రేపారు.
టెన్నిస్: పురుషుల టెన్నిస్‌లో భారత్‌కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఏ ఒక్కరు కూడా టాప్–200 ర్యాంకింగ్స్‌లోకి వెళ్లలేకపోగా, చాలెంజర్ టూర్‌లో సింగిల్స్ విభాగంలో ఒక్కరూ కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయారు. ఏటీపీ టూర్ డబుల్స్‌లో యూకీ బాంబ్రీ దుబాయ్ ఓపెన్ గెలవగా, రితి్వక్ బొల్లిపల్లి చిలీ ఓపెన్ సాధించాడు. డేవిస్ కప్‌లో స్విట్జర్లాండ్‌ను ఓడించి భారత్ 2026 డేవిస్ కప్ క్వాలిఫయర్ దశకు అర్హత సాధించగా... బిల్లీ
జీన్‌కింగ్ కప్‌లో భారత్ ప్లే ఆఫ్స్ దశ వరకు వెళ్లగలిగింది. వర్ధమాన క్రీడాకారిణుల్లో శ్రీవల్లి రషి్మక, మాయ చక్కటి ఆటతో అందరి దృష్టిలో పడినా... ఫలితాలపరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ డబుల్స్ స్టార్, రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోహన్ బోపన్న ఈ ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
బ్యాడ్మింటన్: భారత షట్లర్లు అంతర్జాతీయ వేదికపై మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి కాంస్యం గెలుచుకోవడం ఈ ఏడాది హైలైట్ కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో మరో మూడు టైటిల్స్ మన ఆటగాళ్ల ఖాతాలో చేరాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను లక్ష్య సేన్, యూఎస్ ఓపెన్‌ను ఆయుశ్ శెట్టి గెలుచుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడి సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
టేబుల్ టెన్నిస్: వరల్డ్ టీటీ టూర్‌లో భారత ఆటగాళ్లు రెండు టైటిల్స్ సాధించగలిగారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో దియా–మనుష్ జోడీ ట్యూనిస్ కంటెండర్ టోర్నీని, పురుషుల డబుల్స్‌లో సత్యన్–ఆకాశ్ ద్వయం లాగోస్ కంటెండర్ టోర్నీని సొంతం చేసుకున్నారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా గెలుచుకోవడంలో భారత ప్యాడ్లర్లు సఫలం కాలేకపోయారు. పురుషుల టీమ్ 11వ, మహిళల టీమ్ 12వ ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించింది.
షూటింగ్: ఈ ఏడాది షూటింగ్‌లో భారత్ ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి 11 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్న భారత్... ఓవరాల్‌గా రెండో స్థానంతో ముగించింది. వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా మన షూటర్లు మొత్తం 13 పతకాలు అందించారు. ఈ ఏడాది కొత్తగా వెలుగులోకి వచ్చి వేర్వేరు టోర్నీల్లో సత్తా చాటిన షూటర్‌గా సురుచి సింగ్ (మహిళల పిస్టల్)కు గుర్తింపు
లభించింది.
వెయిట్‌లిఫ్టింగ్: వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఇవి మినహా ఈ క్రీడాంశంలో భారత్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు.
హాకీ: భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో విజేతగా నిలిచి వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు అర్హత
సాధించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో జట్టు ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల హాకీ జట్టు ప్రదర్శన అయితే మరీ పేలవంగా ఉంది. చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ దక్కకపోగా...ప్రొ హాకీ లీగ్‌లో దిగువ స్థానానికి పడిపోయింది.
చెస్: మహిళల చెస్ వరల్డ్ కప్‌లో భారత్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా, కోనేరు హంపి రన్నరప్‌గా నిలవడం ఈ ఏడాది చదరంగంలో చెప్పుకోదగ్గ విశేషం. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాతి ఏడాది గుకేశ్ కెరీర్ పడుతూ, లేస్తూ సాగింది. ‘ఫిడే’ వరల్డ్ కప్‌లో, ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌లో అతను విఫలమయ్యాడు. అయితే నార్వే ఓపెన్‌లో దిగ్గజం కార్ల్‌సన్‌పై సాధించిన గెలుపు చిరస్మరణీయంగా నిలిచింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్, విదిత్, హరికృష్ణ విఫలం కాగా...‘ఫిడే’ సర్క్యూట్‌లో గెలిచి ఎట్టకేలకు ప్రజ్ఞానంద క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించగలిగాడు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి, ఇరిగేశి అర్జున్ కాంస్య పతకాలతో మెరిశారు. ఈ ఒక్క ఏడాదే భారత్ నుంచి ఆరుగురు కొత్త ‘గ్రాండ్‌మాస్టర్లు’ రావడం విశేషం.
అథ్లెటిక్స్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఏడాదిని తన పేరిట లిఖించుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్, పోష్‌్రసూ్టమ్ ఇని్వటేషనల్, కుసోసిన్కీ మెమోరియల్, గోల్డెన్ స్పయిక్ ఒస్ట్రావా, నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లలో (మొత్తం ఐదు) నీరజ్ విజేతగా నిలిచాడు. పైగా కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను కూడా (దోహా డైమండ్ లీగ్‌లో) అతను దాటడం మరో విశేషం. అయితే దురదృష్టవశాత్తూ 2025 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చోప్రా పతకం గెలవకుండా వెనుదిరగడం మాత్రం నిరాశ కలిగించిన అంశం. మరోవైపు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా మొత్తం 24 పతకాలు గెలుచుకున్నారు.
బాక్సింగ్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 4 పతకాలు గెలుచుకుంది. వరల్డ్ బాక్సింగ్ కప్ సిరీస్‌లో భారత్ 3 ప్రపంచ కప్‌లలో కలిపి 13 స్వర్ణాలు సహా మొత్తం 40 పతకాలు సాధించడం విశేషం. తెలంగాణ బాక్సర్ నిఖత్ కూడా పసిడి పతకం నెగ్గింది.
–సాక్షి క్రీడా విభాగం


