భారత్‌ను గెలిపించిన శ్రీకాంత్‌ | Badminton Asia Team C’ships: Kidambi Srikanth stars in decider as Indian men edge Singapore, women beat Myanmar convincingly | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన శ్రీకాంత్‌

Feb 5 2026 10:35 AM | Updated on Feb 5 2026 11:03 AM

Badminton Asia Team C’ships: Kidambi Srikanth stars in decider as Indian men edge Singapore, women beat Myanmar convincingly

కింగ్డావో (చైనా): ఆసియా సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్‌ ‘సి’లో భాగంగా సింగపూర్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–2తో గెలిచింది. 

ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గి స్కోరు 2–2తో సమమైన దశలో... నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 21–16తో జియా వె జోయల్‌ కో (సింగపూర్‌)పై నెగ్గి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 16–21, 21–19, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యెవ్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–10, 21–8తో ఇంగ్‌ కీట్‌ వెస్లీ కో–జున్‌సుకె కుబో జంటపై గెలిచింది.

మూడో మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 21–17, 21–15తో జియా హెంగ్‌ జేసన్‌ టెను ఓడించి భారత్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో పృథ్వీ కృష్ణమూర్తి–సాయి ప్రతీక్‌ ద్వయం 21–8, 21–23, 20–22తో ఎన్జీ జూ జె–డొనోవాన్‌ విలార్డ్‌ వీ జంట చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ తలపడుతుంది.  

మరోవైపు గ్రూప్‌ ‘వై’లో భారత మహిళల జట్టు 5–0తో మయన్మార్‌ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున సింగిల్స్‌లో తన్వీ శర్మ, మాళవిక, రక్షిత శ్రీ, డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా; ట్రెసా జాలీ–గాయత్రి జోడీలు గెలుపొందాయి. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్‌ ఆడుతుంది.    

Advertisement
 
Advertisement
Advertisement