హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ప్రతిష్టాత్మక ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత పురుషుల ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పరాజయం పాలయ్యారు. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంట 21–10, 17–21, 13–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గ్రూప్ దశలో ఈ జోడీపై సులువుగా గెలిచిన భారత జంట... సెమీస్‌లో అదే ఆటతీరు కనబర్చడంలో విఫలమైంది.
తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న తర్వాత... అనవసర తప్పిదాలతో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత షట్లర్లు ప్రత్యర్థి కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. అదే జోరులో తొలి గేమ్ సొంతం చేసుకున్న సాత్విక్–చిరాగ్ దాన్ని కొనసాగించలేకపోయారు.
రెండో గేమ్‌లో 3–6తో వెనుకబడిన భారత ప్లేయర్లు ఆ తర్వాత 7–7, 11–11తో స్కోరు సమం చేశారు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగగా కీలక దశలో పాయింట్లు సాధించిన చైనా జంట గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక అదే జోరులో మూడో గేమ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి రెచ్చిపోగా... భారత జంట పోటీనివ్వలేక పరాజయం వైపు నిలిచింది.


