త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా అభివర్ణించాడు. ఈ జట్టులో అవసరమైన అన్ని అంశాలు (అనుభవం, బలమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్) సమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
అయితే రాత్రి వేళల్లో తేమ ప్రభావం ఆందోళన కలిగిస్తుందని అన్నాడు. ఈ విషయంలో టీమిండియా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించాడు. టాస్ చాలా కీలకమవుతుందని అంచనా వేశాడు. మాహి అన్‌ప్లగ్డ్ అనే కార్యక్రమం సందర్భంగా ధోని ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు.
కోహ్లి, రోహిత్ ఎందుకు ఆడకూడదు..?
ఇదే కార్యక్రమం సందర్భంగా ఇంటర్వూయర్ ధోనిని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి అడిగాడు. వారిద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్ ఆడగలరా అని ప్రశ్నించాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ఆటగాళ్లకు వయసు ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రదర్శన మరియు ఫిట్‌నెస్ మాత్రమే అసలు ప్రమాణాలు. దేశం కోసం కృషి చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా ఎందుకు ఆపాలి.
అనుభవం ఒక్కసారిగా రాదు. 20 ఏళ్ల ఆటగాడికి అనుభవం ఉండదు, సచిన్ టెండూల్కర్ లాంటి అసాధారణ ప్రతిభ తప్ప. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రదర్శన ఉంటే జట్టులో ఉంటారు, లేకపోతే ఉండరు అని అన్నాడు.
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఇటీవలికాలంలో ధోని చెప్పినట్లుగానే టీమిండియా చాలా ప్రమాదకరంగా ఉంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 51-8 విన్-లాస్ రికార్డు సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ సూర్యతో పాటు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉరకలేస్తున్నారు. ప్రపంచకప్‌లో వీరిని ఆపడం ఏ జట్టుకైనా సామర్థ్యానికి మించిన పనే అవుతుంది.
భారత్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. భారత్.. పాకిస్తాన్, యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లతో గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మ్యాచ్ అనుమానంగా ఉంది. భద్రతా కారణాలంటూ ఈ మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేసుకుంది.


