భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా | Jay Shah appoints Singapore administrator to ceasefire IND vs PAK T20 World Cup war | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా

Feb 4 2026 12:35 PM | Updated on Feb 4 2026 12:47 PM

Jay Shah appoints Singapore administrator to ceasefire IND vs PAK T20 World Cup war

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ పంచాయితీలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను పాక్‌ బాయ్‌కాట్‌ చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగప్రవేశం చేశారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించారు. సింగపూర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్‌ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్‌ చేశారు. 

ఖ్వాజా గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా పనిచేసి, అన్ని ప్రధాన క్రికెట్‌ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్‌ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని మార్చుకొని, భారత్‌తో మ్యాచ్‌ ఆడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 

ఒకవేళ పాక్‌ ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను సైతం పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జై షా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఖ్వాజాను మధ్యవర్తిత్వానికి పంపాడు. టెక్నికల్‌గా ఉండే లూప్‌ హోల్స్‌ను వాడుకుంటూ పాక్‌ డ్రామాలు ఆడుతుందన్నది షా వాదన. ఈ విషయమై పీసీబీ లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. 

ఒకవేళ ఐసీసీ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమై పాక్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రంగా నష్టపోతుంది. ప్రపంచకప్‌ వరకు మ్యాచ్‌ పాయింట్లు కోల్పోతుంది. అలాగే ఈ మ్యాచ్‌ జరగకపోవడం​ వల్ల కలిగే నష్టాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం ఆర్దిక, పాలనా పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభమవుతాయి. అదే రోజు భారత్‌, పాక్‌ తమ తొలి మ్యాచ్‌లు ఆడతాయి. పాక్‌ నెదర్లాండ్స్‌తో.. భారత్‌ యూఎస్‌ఏతో తలపడతాయి. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement