భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్ బౌలర్ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రేను టార్గెట్ చేసిన రజా.. ఆతర్వాత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని గెలికాడు. ఇద్దరూ తగు రీతిలో రజాకు సమాధానం చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.
ఏమన్నావురా..?
భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో అలీ రజా అద్బుతమైన బంతితో మాత్రేను ఔట్ చేశాడు. ఔట్ చేసిన ఆనందంలో రజా మాత్రే పట్ల దురుసుగా స్పందించాడు.
ఇక చాలు వెళ్లు అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మాత్రే ఏమన్నావురా అన్నట్లు రజా మీదికి వెళ్లాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
वैभव सूर्यवंशी पाकिस्तानियों को उनकी औकात बताते हुए ।#INDvsPAK #vaibhavsuryavanshi pic.twitter.com/NpoPl5hBFA
— सनातन सर्वोच्च🚩 मोदी का परिवार (@sanatani58) December 21, 2025
నీ స్థాయి నా కాళ్ల కింద..!
మాత్రేని గెలికి చీవాట్లు తిన్న రజా వైభవ్ సూర్యవంశీతో కూడా అలాగే ప్రవర్తించాడు. సిక్సర్‌తో ఛేదన ప్రారంభించిన సూర్యవంశీని (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఔట్ చేసిన రజా ఓవరాక్షన్ చేశాడు. సూర్యవంశీకి ఫియరీ సెండాఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
రజా ఓవరాక్షన్‌కు సూర్యవంశీ కూడా తగు రీతిలో బదులిచ్చాడు. నీ స్థాయి నా కాళ్ల కింద అన్నట్లు రజాకు బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
టీమిండియాకు పరాభవం
348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.
పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.
భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.
ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు.
ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.
భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.


