T20 WC: చెలరేగిన షెఫర్డ్‌.. విండీస్‌ బోణీ | T20 WC 2026: Hetmyer Shines Shepherd Hattrick West Indies Beat Scotland | Sakshi
Sakshi News home page

T20 WC: హెట్‌మెయిర్‌ ధనాధన్‌.. చెలరేగిన షెఫర్డ్‌.. విండీస్‌ బోణీ

Feb 7 2026 7:04 PM | Updated on Feb 7 2026 7:30 PM

T20 WC 2026: Hetmyer Shines Shepherd Hattrick West Indies Beat Scotland

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్‌ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్‌కతా వేదికగా గ్రూప్‌-‘సి’ నుంచి విండీస్‌- స్కాటిష్‌ జట్లు శనివారం తలపడ్డాయి.

ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో బ్రాండన్‌ కింగ్‌ (35) రాణించగా.. కెప్టెన్‌ షాయీ హోప్‌ (19) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

మొత్తంగా 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో హెట్‌మెయిర్‌ 64 పరుగులు సాధించాడు. రోవ్‌మన్‌ పావెల్‌ (14 బంతుల్లో 24), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (13 బంతుల్లో 26) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విండీస్‌ 182 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.

స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ క్యూరీ రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్‌ షరీఫ్‌, ఒలీవర్‌ డేవిడ్‌సన్‌, మైకేల్‌ లీస్క్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జార్జ్‌ మూన్సే (19), బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ (14) నిరాశపరచగా.. మైకేల్‌ జోన్స్‌ (1) విఫలమయ్యాడు.

ఇలాంటి తరుణంలో రిచీ బెరింగ్‌టన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (24 బంతుల్లో 42)తో అలరించగా.. టామ్‌ బ్రూస్‌ (28 బంతుల్లో 35) అతడికి తోడుగా నిలిచాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. మాథ్యూ క్రాస్‌ (11), మార్క్‌ వాట్‌ (15) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. 18.5 ఓవర్లలోనే స్కాట్లాండ్‌ ఆలౌట్‌ అయింది. 147 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు తీయగా.. షెఫర్డ్‌ హ్యాట్రిక్‌తో కలిపి ఐదు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. షమర్‌ జోసెఫ్‌, గుడకేశ్‌ మోటీ తలా ఒక వికెట్‌ తీసి తమ వంతు సాయం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement