రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag duo finish runners up in China Masters World Tour Super 750 tournament | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Sep 22 2025 3:58 AM | Updated on Sep 22 2025 3:58 AM

Satwik and Chirag duo finish runners up in China Masters World Tour Super 750 tournament

షెన్‌జెన్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 19–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్‌ జంట కిమ్‌ వన్‌ హో–సియో సెయంగ్‌ జే (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 

రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌లకు 43,750 (రూ. 38 లక్షల 54 వేలు) డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 9350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఫైనల్లో తొలి గేమ్‌లో 14–7తో ఆధిక్యంలో నిలిచిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.

ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరిన సాత్విక్‌–చిరాగ్‌ తుది పోరులో మాత్రం వరుస గేముల్లో ఓటమి పాలయ్యారు. గతవారం హాంకాంగ్‌ ఓపెన్‌ టోర్నీలోనూ రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌... అంతకుముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకుంది.   

సింగిల్స్‌ విజేత ఆన్‌ సె యంగ్‌ 
ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, దక్షిణ కొరియా స్టార్‌ ఆన్‌ సె యంగ్‌ మరో టైటిల్‌ గెలిచింది. చైనా మాస్టర్స్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆన్‌ సె యంగ్‌ 21–11, 21–3తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ హాన్‌ యువె (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది ఆన్‌ సె యంగ్‌ ఖాతాలో ఇది ఏడో టైటిల్‌ కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement