సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు... తిరువనంతపురం వేదికగా ఆదివారం శ్రీలంకతో నాలుగో టి20 ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 3–0తో సిరీస్ చేజిక్కించుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... అదే జోరు కొనసాగిస్తూ నాలుగో మ్యాచ్‌లోనూ నెగ్గాలని భావిస్తోంది.
గత మ్యాచ్‌ల్లో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు శ్రీలంక స్వల్ప స్కోర్లకే పరిమితమైంది. టాపార్డర్ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో... టీమిండియా సునాయాసంగా లక్ష్యాలను ఛేదించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.
బౌలింగ్‌లో ఏపీ అమ్మాయి శ్రీచరణి నిలకడ కొనసాగిస్తుండగా... రేణుక, క్రాంతి, దీప్తి, వైష్ణవి, అమన్‌జ్యోత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సిరీస్ దక్కడంతో ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్షప్రసారం


