స్విమ్మింగ్‌ చాంప్స్‌ శివాని, ఇషాన్‌ | South Zone Aquatic Champions Shivani and Ishaan | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ చాంప్స్‌ శివాని, ఇషాన్‌

Dec 28 2025 4:09 AM | Updated on Dec 28 2025 4:09 AM

South Zone Aquatic Champions Shivani and Ishaan

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు కర్రా శివాని, ఇషాన్‌ దాస్‌ విజేతలుగా నిలిచారు. తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో శివాని బ్యాక్‌స్ట్రోక్, ఫ్రీస్టయిల్‌ ఈవెంట్లలో విజయం సాధించింది. బాలికల అండర్‌–13, 14 విభాగం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శివాని పోటీని 1 నిమిషం 10.82 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. కేరళకు చెందిన శ్రేయ బినిల్‌ (1:11.24 సె.) రజతం, కర్ణాటక అమ్మాయి దీత్య బొపన్న (1:12.12 సె.) కాంస్యం నెగ్గారు. 

200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని (2ని.17.93 సె.) మరో స్వర్ణం గెలిచింది. బాలుర అండర్‌–15 విభాగంలో ఇషాన్‌ దాస్‌ గెలుపొందాడు. 50 మీటర్ల బటర్‌ ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఇషాన్‌ పోటీని అందరికంటే ముందుగా 26. 44 సెకన్లలో పూర్తి చేశాడు. అతని సహచరుడు గౌతమ్‌ నాయుడు (26.88 సెకన్లు) మూడో స్థానంలో నిలువగా, కర్ణాటక కుర్రాడు అనిశ్‌ అనిరుధ (26.66 సె.) రజతం నెగ్గాడు. 

బాలికల అండర్‌–15, 17 విభాగంలో నిర్వహించిన 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో తెలంగాణ స్విమ్మర్‌ దాక్షిణ్య హరిణి (2 ని.55.42 సె.) స్వర్ణం సాధించింది. ఆంధ్ర ప్రదేశ్‌ అమ్మాయి పావని సరయు (2 ని.55.65 సె.) రజతం గెలుచుకుంది. సమన్వి (3 ని.02.50 సె.; కర్ణాటక) కాంస్యం అందుకుంది. బాలుర అండర్‌ 11, 12 విభాగాలకు సంబంధించిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్‌ అర్జున్‌ సందీప్‌ కాశ్వాన్‌ (1 ని.11.03 సె.) రజత పతకం గెలిచాడు. ఇందులో తమిళనాడు కుర్రాడు రోహిత్‌ (1 ని.09.13 సె.) బంగారం, కర్ణాటక స్విమ్మర్‌ లోహితశ్వ నగేశ్‌ (1 ని.12.55 సె.) కాంస్యం అందుకున్నారు. 

ఇతర బాలికల పోటీల ఫలితాలు 
అండర్‌–13,14 వయో విభాగంలో జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో రాష్ట్రానికి చెందిన జొనా శిజు (5 ని.02.87 సె.) కాంస్యం నెగ్గింది. కర్ణాటక స్విమ్మర్లు తన్వీ గౌరవ్‌ (4 ని.57.66 సె.), ఇదిక భట్‌ (5 ని.00.49 సె.) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. అండర్‌–15, 17లో జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో తెలంగాణ అమ్మాయి మెరుపుల లిఖితకు కాంస్యం దక్కింది. 

ఆమె 20 నిమిషాల 26.11 సెకన్లలో పోటీని పూర్తి చేసి మూడో స్థానం పొందింది. ఇందులో కర్ణాటక స్విమ్మర్లు అదితి (19 ని.09.58 సె.) బంగారం, ప్రతీక్ష గౌడ (19 ని.41.95 సె.) రజతం నెగ్గారు. అండర్‌–11, 12లో 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సంయుక్త (1 ని.30.06 సె.) రజతం, ఏపీ అమ్మాయి కొంగర సింధూర (1 ని.30.13 సె) కాంస్యం గెలుపొందారు. 

ఇందులో ధ్రుతి అభిలాష్‌ (1 ని.26.75 సె.; కర్ణాటక) బంగారు పతకం గెలిచింది. అండర్‌–13,14లో 50 మీటర్ల బటర్‌ ఫ్లయ్‌లో వేములపల్లి దిత్య చౌదరి (32.11 సె.) కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన మాన్య వాధ్వా (31.06 సె.), ఆద్య భరద్వాజ్‌ (31.10 సె.) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement