
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్ర కథ బాగుంది. యూత్ కంటెంట్‌తో మంచి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత ఉండదు.. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. మా చిత్రం చూసి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు’’ అని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ–‘‘సినిమాలకు ప్రేక్షకులు రావాలని మనం డిమాండ్ చేయడంలో అర్థం లేదు. సినిమా బాగుంటే వాళ్లే వస్తారు. మల్టీప్లెక్స్‌లో ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది నిజమే. అయితే మూవీ బాగుంటే ప్రేక్షకుడు ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోజుకి ఐదు షోలు వేయాలని ప్రభుత్వం ఆదేశించినా పాటించడం లేదు.. ఇక్కడ నిబంధనలు ఎన్నో ఉంటాయి. కానీ, పాటించడమే అసాధ్యం’’ అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘బన్నీ వాస్‌గారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. దానికి తగినట్లే నిర్మాతలూ మారాల్సి ఉంది’’ అని తెలిపారు.