
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్‌తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్‌డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.
సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు.