సినిమాలని పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగిలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'బెట్టింగ్ యాప్స్‌తో నాకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్‌పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయటపెడతా' అని మీడియాతో రవి అన్నాడు.
మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాం. ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఇతడికి చెందిన రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. బెట్టింగ్ యాప్స్‌తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్‌సైట్స్‌తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నాం. విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడు. త్వరలోనే మిగతా ఇద్దరి స్నేహితులను విచారిస్తాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు.


