వార్డులో తట్ట మట్టి వేయలేదు.. ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నాం
సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో
16వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కంభంపాటి అబ్రహాం
సత్తెనపల్లి: సత్తెనపల్లిలోని తన వార్డులో తట్ట మట్టి వేయలేదని, ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదని, వార్డులో ప్రజల వద్దకు వెళితే చెప్పుతో కొట్టేలా ఉన్నారని 16వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కంభంపాటి అబ్రహాం ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. 16వ వార్డు కౌన్సిలర్ కంభంపాటి అబ్రహాం మాట్లాడుతూ 16వ వార్డులో రెండు గోనలు ఏర్పాటు చేయాలని సంవత్సరం నుంచి అడుగుతున్నానని.. అదిగో, ఇదిగో అంటున్నారు తప్ప ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. వార్డులోకి వెళితే ఓ మహిళ సమస్యలపై నిలదీసి తనను చెప్పుతో కొడతానన్నదని, అది చెప్పుకోవాలంటేనే సిగ్గుచేటుగా ఉందన్నారు.
తన వార్డులో ఆదివారం సాయంత్రం లోగా రెండు గోనలు ఏర్పాటు చేయకుంటే విలేకరులను పిలిచి ఎమ్మెల్యే కన్నా హయాంలో తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది బహిరంగంగా ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పేరు చెబితే ప్రజలు చెప్పులు, చీపురులు తీసుకొని కొట్టేలా ఉన్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఆ సమయంలో 19వ వార్డు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావు జోక్యం చేసుకొని రూ. 7 కోట్లతో ఎమ్మెల్యే కన్నా హయాంలో అభివృద్ధి పనులు జరిగాయంటూ చెప్పబోతుండగా... కంభంపాటి అబ్రహాం అడ్డుపడి ఆపవయ్యా.. అటు ఇటు మాట్లాడేవాళ్లు ఉండబట్టే పరిస్థితి ఇలా తయారైందన్నారు.
మనకు రావాల్సిన గౌరవ వేతనాలే సరిగ్గా ఇవ్వడం లేదని, ఆరు నెలలుగా గౌరవవేతనాలు రావడంలేదని తనదైన శైలిలో ఆవేదన వ్యక్తపరుస్తూ మండి పడ్డారు. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావుకు హితబోధ చేశాడు. కో–ఆప్షన్ మెంబర్ కొణతం స్వాతి, 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, 31వ వార్డు కౌన్సిలర్ తురకా మేరీగ్రేస్, 20వ వార్డు కౌన్సిలర్ కూకుట్ల లక్ష్మి తదితరులు తమతమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ డీఈ మధుసూధన్‌రావు, కౌన్సిలర్లు, కోప్షన్ మెంబర్లు, సెక్షన్ హెడ్లు, ఉన్నారు.


