
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..
ఆ సినిమాతో క్లిక్
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.
చాలా అవకాశాలొచ్చాయి, కానీ..
చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.
నిత్యవిద్యార్థిని
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.
ఆ హీరోయిన్‌కు అభిమానిని
నేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.