ఏపీలో పెరగనున్న సినిమా టికెట్‌ ధరలు.. అది కూడా పర్మినెంట్‌గా! | Movie Tickets Hike In Andhra Pradesh will be soon | Sakshi
Sakshi News home page

ఏపీలో పెరగనున్న సినిమా టికెట్‌ ధరలు.. అది కూడా పర్మినెంట్‌గా!

Dec 29 2025 4:41 PM | Updated on Dec 29 2025 4:49 PM

Movie Tickets Hike In Andhra Pradesh will be soon

మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్‌ థియేటర్‌లో ఇకనుంచి రూ. 50 టికెట్‌ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్‌ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.

పవన్‌ కల్యాణ్‌తో చర్చలు
సినిమా విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు.  'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్‌ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్‌ ధర ఉంది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ. 175 వరకు ఉంది.  

ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్‌ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్‌ థియేటర్స్‌లలో టికెట్‌ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా  కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ  ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.

సింగిల్‌ థియేటర్‌ టికెట్‌ ధర రూ. 150
కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి  బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్‌ ఆధారంగా టికెట్‌ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్‌ థియేటర్‌లో టికెట్‌ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్‌ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement