టాలీవుడ్ సంగతి కాస్త పక్కనబెడితే తమిళంలో ఈసారి సంక్రాంతికి ఊహించన విషయాలు చాలా జరిగాయి. దళపతి విజయ్ 'జన నాయగణ్' మూవీ.. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. శివకార్తికేయన్ 'పరాశక్తి' మెప్పించలేకపోయింది. కార్తీ 'వా వాతియర్' అట్టర్ ఫ్లాప్ అయింది. చివరి నిమిషంలో హడావుడిగా పండగ బరిలో నిలిచిన హీరో జీవా నటించిన 'తలైవర్ తంబి తలైమయిల్' అనే కామెడీ సినిమా హిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథేంటి?
జీవారత్నం(జీవా) ఓ పల్లెటూరికి సర్పంచ్. అందరికీ చేదోడు వాదోడులా ఉంటాడు. ఓ రోజు తన ఊరికి చెందిన ఇళవరసు(ఇళవరసు) కూతురు సౌజన్య(ప్రార్థన నాథన్) పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యతని తీసుకుంటాడు. ఉదయమే శుభకార్యం అనగా పక్కింట్లో ఓ ముసలాడు చనిపోతాడు. ఓవైపు పెళ్లిసందడి, మరోవైపు చావు విషాదం. ఈ రెండిళ్ల మధ్య ఎలాంటి గందరగోళం ఏర్పడింది? జీవా ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
సింపుల్ కాన్సెప్ట్, పరిస్థితులకు తగ్గట్లు వచ్చే కామెడీతో మలయాళంలో ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. దాదాపు ఇదే టెంప్లేట్‌తో వచ్చిన తమిళ మూవీ 'తలైవర్ తంబి తలైమయిల్'. ఓ పల్లెటూరు, ఓ సర్పంచ్, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, ఓ పెళ్లి, ఓ చావు.. వీటన్నింటి నుంచి పుట్టుకొచ్చే కామెడీతో ఈ సినిమా తీశారు.
పల్లెటూళ్లలో పంతాలు పట్టింపులు లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే గొడవ కాస్త.. ఊరిలో విధ్వంసానికి ఎలా కారణమైంది అనే విషయాన్ని చాలా సరదాగా, కామెడీగా ఇందులో చూపించారు. రెండు గంటల్లోపే ఉండే ఈ మూవీ అక్కడక్కడ బోర్ కొట్టినప్పటికీ.. ఓవరాల్‌గా పర్లేదు బానే ఉందనిపించేలా సాగుతుంది.
మూవీ ప్రారంభ సన్నివేశంలో ఓ వ్యక్తిని పిచ్చోడు అని ఊరి మొత్తం అంటుంది. జీవా కూడా మనసులో అలానే అనుకుంటాడు. కానీ చివరకొచ్చేసరికి అతడు తప్పితే ఊరంతా పిచ్చోళ్లే అనే విషయాన్ని జీవా అర్థం చేసుకుంటాడు. ఇదే అంశాన్ని చూపించిన విధానం బాగుంది. పాత్రలన్నీ కూడా ఎక్కడా అతిగా ప్రవర్తించవు. పరిస్థితులకు తగ్గట్లే అలా అలా వెళ్లిపోతాయి.

ఓ సర్పంచ్, ఇద్దరు వయసైన వ్యక్తులు, ఓ ముసలాడు, ఓ పెళ్లి కూతురు, ఓ పెళ్లి కొడుకు.. చివరకు ఊరిలోని వాటర్ ట్యాంక్‌ని కూడా కథలో భాగం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సర్పంచ్ పాత్రలో జీవా ఆకట్టుకోగా.. ఇళవరసు, తంబి రామయ్య కూడా మెప్పించాడు. పెళ్లి కూతురిగా ప్రార్థన నాథన్ క్యూట్‌గా చేసింది. మిగతా పాత్రధారులు తమకిచ్చిన రోల్స్‌కి న్యాయం చేశారు.
టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరదాగా సాగిపోయింది. నితీశ్ సహదేవ్ దర్శకుడిగా మెప్పించాడు. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. ఈ వీకెండ్ ఏదైనా సరదాగా సాగిపోయే ఓ కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'తలైవర్ తంబి తలైమయిల్'పై ఓ లుక్కేయొచ్చు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరక సీన్స్ లేవు.
- చందు డొంకాన


