
యూట్యూబర్, మీమర్ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్‌గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా సినిజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.
సెలబ్రిటీల ప్రశంసలు
సినిమా బాగుందంటూ గోపీచంద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ మహేశ్‌కు పెద్ద ఫ్యాన్స్. ముఖ్యంగా సినిజిత్.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్‌బాబు లిటిల్ హార్ట్స్ సినిమాపై రివ్యూ ఇచ్చాడు.
దయచేసి ఎక్కడికీ వెళ్లకు
'లిటిల్ హార్ట్స్ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్‌బాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్ చూడగానే సినిజిత్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు.
NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d
— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025