ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.
సినిమా ఈవెంట్స్‌లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...
ఛీ కొట్టే ప్రశ్న
'తెలుసు కదా' ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!
హీరో మెటీరియల్ కాదా?
దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో కూడా.. ప్రదీప్ రంగనాథన్‌ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.
బుద్ధి చెప్పిన మంచు లక్ష్మి
హీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్‌కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.
స్లీవ్‌లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్
ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్‌కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్‌లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్‌లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.
మీ బరువెంత?
గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్‌లో హీరోయిన్ గౌరీ కిషన్‌ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి.. హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే!
మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో!


