మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్... "దృశ్యం" సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.
జోక్ అనుకున్నా..
కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా? అన్నాను.
కలలో కూడా అనుకోలేదు
ఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్ చేస్తే.. ఆయన కూతురిగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదుట గ్రాడ్యుయేషన్ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!
అంత స్థోమత ఎక్కడిది?
నాకు లండన్‌లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్ లోన్స్ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.
పేరెంట్స్ అండగా
కానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.
అదే అసలు కష్టం
నేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని.
చాలా నేర్చుకున్నా..
దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


