శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ! | Actress Sreeleela Comments On Netizens Trolls And AI Generated Abuse, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!

Dec 18 2025 11:50 AM | Updated on Dec 18 2025 1:17 PM

Actress Sreeleela Comments On Trolls And Netizens

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్‌ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్‌ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్‌ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్‌కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్‌ ఉందనే విషయం మీకు తెలుసా?.. 

శ్రీలీల  ఏం చెప్పిందంటే.. సోషల్‌ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్‌ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్‌ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్‌కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్‌ చేసిన పోస్ట్‌ ఉంది. సోషల్‌మీడియాలో ట్రోల్స్‌కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్‌కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్‌లైన్‌లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.

మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్‌ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్‌ చిన్మయి, హీరోయిన్‌ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్‌‌కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

ట్రోల్స్‌  వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్‌ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్‌, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్‌తో పాటు ఏఐ మార్ఫింగ్‌ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్‌ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్‌ ఫోటోలు, వీడియోలు క్రియేట్‌ చేసి ట్రోల్స్‌  వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement