మలయాళ నటుడు, 'దేవి' సినిమా ఫేమ్ షిజు ఏఆర్ విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'ప్రీతి ప్రేమ్-నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించకండి. ఇకపై మేము విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశాడు.
లవ్ స్టోరీ
షిజు మలయాళంలో హీరోగా నటించిన తొలి చిత్రం 'ఇష్టమను నూరు వట్టం'. కువైట్‌లో 12వ తరగతి చదువుతున్న సమయంలో ప్రీతి ఈ సినిమా చూసింది. ఇందులోని హీరో షిజు ఆమెకు తెగ నచ్చేశాడు. కట్ చేస్తే కొన్నేళ్లకు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీ ఎక్కింది ప్రీతి. అలా ఓసారి చెన్నై ఎయిర్‌పోర్టులో షిజును కలిసింది. అప్పుడే ఇద్దరూ మాట్లాడుకోవడం.. నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయి. ఫ్రెండ్స్‌గా బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవారు.

ఓరోజు షిజు.. ప్రీతికి ఫోన్ చేసి నువ్వంటే నాకిష్టం అన్నాడు. టీనేజీ నుంచి ఇష్టపడుతున్న హీరో తనను ఇష్టపడేసరికి ప్రీతికి నోటమాట రాలేదు. వారం రోజుల్లో షిజు ఆమెకు మరోసారి ప్రపోజ్ చేశాడు. అప్పుడు కానీ ప్రీతికి ఓ విషయం గుర్తురాలేదు. అతడు ముస్లిం, తాను క్రిస్టియన్ అని! కొంత సమయం కావాలని అడిగింది. ఇంట్లో అడిగితేనేమో ఇద్దరి మతాలు వేరని వ్యతిరేకించారు.
మతం కన్నా మనిషి వ్యక్తిత్వమే ముఖ్యమని భావించిన ప్రీతి ఎక్కువ ఆలస్యం చేయదల్చుకోలేదు. మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామంది. అలా 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది. తర్వాత కూతురి సమక్షంలో మరోసారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడిపోయారు.
సినిమా
మలయాళంలో అనేక సినిమాలు చేసిన షిజు (Shiju Abdul Rasheed) 'దేవి' మూవీతో తెలుగువారికి పరిచయమయ్యాడు. సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, శివరామరాజు, శతమానం భవతి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా రాబిన్‌హుడ్ మూవీలో కనిపించాడు. మలయాళ బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనడమే కాకుండా టాప్ 5లో ఒకరిగా నిలిచాడు. ప్రీతి.. ప్రస్తుతం ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్‌గా రాణిస్తోంది. అలాగే ఈమె లాయర్ కూడా!


