ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకను చూడాలని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తారు. 1976 నుండి ఆస్కార్ అవార్డుల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా ఇదే ఛానల్‌లో ఆస్కార్‌కు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఇప్పుడు వారి బంధానికి యూట్యూబ్ బ్రేక్ వేసింది.
ఆస్కార్ అవార్డుల వేడుకును ప్రపంచవ్యాప్తంగా లైవ్‌లో చూసే ఛాన్స్‌ను యూట్యూబ్ కల్పిస్తుంది. 2029 నుండి 2033 వరకు ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను యూట్యూబ్‌కి మంజూరు చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ABCతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ముగిసింది.
అయితే, 2028లో 100వ ఆస్కార్ అవార్డులు జరగనున్నాయి. ఈ ఈవెంట్ వరకు ABC ప్రసారం చేస్తుంది. ఈ పెను మార్పు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా చూడొచ్చు అనే ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రెడ్ కార్పెట్ కవరేజ్ మరియు తెరవెనుక కంటెంట్ కూడా ఉంటుంది.


