కొన్ని ఫుడ్ ట్రీట్స్, ఇంటినుంచి సర్‌ప్రైజ్‌లు అందుకునేందుకు బిగ్‌బాస్ సరదా గేమ్స్ పెడుతూ వస్తున్నాడు. ఇందులో గెలిచిన పవన్‌కు ఇంటినుంచి వీడియో సందేశం రాగా తనూజకు ఫ్యామిలీ ఫోటో అందింది. మరి ఈసారి ఆ సర్‌ప్రైజ్ ఎవరు గెల్చుకున్నారో బుధవారం (డిసెంబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
సంజనాకు వీడియో మెసేజ్
బాల్స్ విసిరే గేమ్‌లో కల్యాణ్ గెలిచి ఒక స్టార్‌తోపాటు స్వీట్ పొందాడు. ప్లేయర్ ఆఫ్ దిడేగా సంజనాను ఎంపిక చేయడంతో తన చెల్లెలు, హీరోయిన్ నిక్కీ గల్రానీ వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఇక ఇమ్మాన్యుయ్యేల్ జ్యోతిష్యుడిగా మారి హౌస్‌మేట్స్ జాతకాలు చెప్పడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత ఫైనలిస్టుల కోసం గ్రాండ్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది. గార్డెన్ ఏరియాలో తను ఆడిన టాస్కులు, వాటి ఫోటోలు చూసి ఎమోషనలయ్యాడు.
అసలైన ఎంటర్‌టైనర్
ఇక బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బాధ, నిరాశ, ఓటమి.. ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ, అది సాధ్యం కాదు. వాటి నుంచి తేరుకునేందుకు మనుషులు కోరుకునేది ఆనందం. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచేవారే ఎంటర్‌టైనర్స్. చిన్నప్పటినుంచి కష్టాలను అనుభవించినవారికే చిరునవ్వు బలమేంటో బాగా తెలుసు. అదే బలంగా మీరు ముందుకు సాగారు. నీ ఆటతో మిగతావారి ఆటస్థాయి పెంచారు.

ఇమ్మూపై బిగ్‌బాస్ ప్రశంసలు
ఇంటిసభ్యులు మీకు దగ్గరైనవారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాటమార్చలేదు, అలా అని వారి తోడు వీడలేదు. మీ ఆటలో, భావాల్లో నిజాయితీగా ఉన్నారు. మంచివైపే నిల్చున్నారు. మీకు దగ్గరైనవాళ్లు చేసింది తప్పనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఎన్ని జరిగినా ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేయాలనేది ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు.
అమ్మ కల నెరవేరింది
ప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులూ, ఆడంబరాలు అక్కర్లేదు. వ్యక్తిత్వం ఒక్కటే అవసరం. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్‌గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కల నిజమైంది అని బిగ్‌బాస్ చెప్పడంతో ఆనందభాష్పాలు కార్చాడు. తర్వాత తన జర్నీ చూసుకుని ఓపక్క సంతోషిస్తూనే.. మరోపక్క గుక్క పెట్టి ఏడ్చాడు. కట్టకాలే వరకు అందర్నీ నవ్విస్తూనే ఉంటానని మాటిచ్చాడు.


