తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.
ఒక్కవారంలో అంతా అయిపోయిందా?
అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.
ఏడ్చేసిన డిమాన్ పవన్
డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్‌లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.
టాప్ 5 ఎమోషనల్
కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు.


