దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఆయన విగ్రహం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దీన్ని పెట్టాలనుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. అయితే బాలు విగ్రహం వద్దని అంటూ పలు ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కొన్నిరోజులుగా ఈ తతంగం నడిచింది. విగ్రహావిష్కరణ రోజు(డిసెంబరు 15) రావడంతో మళ్లీ వ్యతిరేకత కనిపించింది. దీంతో పోలీసులు.. భారీ బందోబస్తు సిద్ధం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహావిష్కరణ చేస్తారు.
ఈ వేడుకకు వచ్చిన బాలు చెల్లి, గాయని ఎస్పీ శైలజ.. అన్నయ గురించి, విగ్రహ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన బతికి ఉన్నపుడే తన విగ్రహం కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నారు. ఇప్పుడు వాయిద్య బృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది అని శైలజ చెప్పుకొచ్చారు. వివాదం గురించి అడగ్గా.. అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు నాకు తెలియదు, కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. బాలు తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఈ విషయంలో వివాదం చేయడం సరికాదని అన్నారు.


