సినిమాల్లో బయోపిక్స్ కొత్తేం కాదు. నాలుగైదేళ్ల ముందు విపరీతంగా వచ్చాయి. ప్రస్తుతం ట్రెండ్ మారిపోవడంతో అప్పుడప్పుడు జీవితకథల్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన బెస్ట్ బయోపిక్ అంటే చాలామంది చెప్పే మాట 'మహానటి'. ఇది తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో క్రేజీ బయోపిక్‌కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ్'లో సీతగా చేస్తున్న సాయిపల్లవి.. త్వరలో తెలుగు బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తీయబోయే ఓ బయోపిక్‌లో నటించబోతుందని తాజాగా రూమర్స్ వస్తున్నాయి. అదే దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి జీవితకథ. సుబ్బలక్ష‍్మిగా సాయిపల్లవి కనిపించనుందనే విషయం.. సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ రావా, జెర్సీ, కింగ్డమ్ చిత్రాలు తీసిన గౌతమ్ తిన్ననూరి.. ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడని అంటున్నారు.
(ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రకటన వచ్చే అవకాశముందని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది రూమర్ మాత్రమేనా లేదంటే నిజమా అనేది కొన్నిరోజులు క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ తీస్తే ఏమేం చూపిస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే సుబ్బలక్ష‍్మి అంటే కేవలం సింగర్ మాత్రమే కాదు. అంతకు మించిన గుర్తింపు దేశవ్యాప్తంగా సొంతం చేసుకున్నారు. అలాంటి ఈమె బయోపిక్ అంటే ఏం చూపిస్తారు? ఎలా తీస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. తమిళనాడులోని మధురైలో 1916లో పుట్టారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయనిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో 'భారతరత్న' పొందిన తొలి సంగీత విద్వాంసురాలు, రామన్ మెగసెసే అవార్డును అందుకున్న మొదటి భారతీయ సంగీత కళాకారిణి ఈమెనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా "భారతదేశపు నైటింగేల్"గా పేరుగాంచారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


