బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్‌ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్ టాప్ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్ చేశారు.
కామనర్ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్‌లోకి వచ్చిన భరణి ఫైనల్స్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...
నలిగిపోయిన భరణి
భరణి మొదట ఎలిమినేట్ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున వార్నింగ్ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.

ఫ్యామిలీ వీక్‌తో మార్పు
కానీ దివ్య ఫెవికాల్‌లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్‌లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.
విమర్శలు
భరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్ ఎంట్రీలో మాత్రం ఫైర్ చూపించాడు. ఆ ఫైర్ మాటల్లో ఉంది కానీ గేమ్‌లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్‌తో ఫైనల్‌కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.
చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి


