డిజిటల్ లెర్నింగ్ అనివార్యంగా పిల్లల జీవితంలో భాగమైన రోజులొచ్చాయి. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలు, నోట్సులతో విద్య సాగితే ఇప్పుడు స్కూలు, కాలేజీలకు సమాంతరంగా పిల్లలు ఇంట్లో యూ ట్యూబ్ పాఠాలతో చదువుతున్నారు. అయితే ఈ చదువు ఎంత వరకు ఉండాలి? ఈ చదువును పిల్లలకు ఎంత మేరకు తల్లిదండ్రులు అనుమతించాలి? పరీక్షలు దగ్గర పడుతున్న సమయం ఇది.
పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దే కాలం నుంచి డిజిటల్ స్లేట్ మీద అక్షరాలు రాసే కాలం దాకా చిన్నారులు ఎదిగారు. ఒకప్పుడు పాఠాలంటే పుస్తకాల్లో చూసి చెప్పేవే. కానీ మారిన కాలంలో పాఠం డిజిటలైజ్ అయిపోయింది. అచ్చయిన అక్షరం కన్నా కంటి ముందు కనిపించే రూపాలను చూపిస్తూ పాఠం చెప్తున్నారు టీచర్లు. ఈ ట్రెండ్ మరింత ముందుకు వెళ్లి, యూట్యూబ్ సరికొత్త టీచర్‌గా మారిపోయింది. ఏ అంశమైనా అర్థం కాకపోతే విద్యార్థులు అందులో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. కేవలం పుస్తకాలనే నమ్ముకోకుండా టెక్నాలజీ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది మంచా, చెడా, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేది ప్రస్తుతం చర్చగా మారింది.
వ్యూస్ ప్రభావితం చేస్తున్నాయి
గతంలో పిల్లలు టీచర్ పాఠం చెప్తున్నప్పుడు అర్థం కాకపోతే లేచి అడిగేవారు. సందేహాలు తీర్చేందుకు ఇంట్లో పెద్దలు, ట్యూషన్ టీచర్లు ఉండేవారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు వెనుక స్థానం తీసుకున్నాయి. ఓపిక లేని టీచర్లు, తీరిక లేని తల్లిదండ్రులు యూట్యూబ్‌ను పిల్లల చేతుల్లో పెట్టారు. అందులో అనేకమంది ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యే సులభరీతిలో అంశాలను బోధిస్తున్నారు. అవన్నీ ఉచితం కావడంతో చిన్నారులు వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో కొన్ని వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ ఉంటున్నాయి. వ్యూస్‌ను చూసి పిల్లలు మరింతగా ఆ వీడియోస్‌ను ఫాలో అవుతున్నారు.
ఎందుకీ మార్పు?
ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ విప్లవం మొదలైంది. రాన్రానూ అది మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో చిన్నారులకు సాంకేతిక అనుభవం అవసరం అనేది తల్లిదండ్రుల వాదన. ఈ సమయంలో పాఠాలకు కేవలం పుస్తకాల మీద, టీచర్ల మీద మాత్రమే ఆధారపడితే కష్టమని, యూట్యూబ్ ద్వారా నేర్పే పాఠాలు చిన్నారులకు చేరాలని వారి మాట. పైగా పుస్తకాల్లోని అంశాలు పేరాల కొద్దీ రాసినా అవి చిన్నారులకు అనుభవపూర్వకమైన జ్ఞానం అందించలేవు. వీడియోలో అయితే వారి కంటికి అన్నీ కనిపిస్తూ వివరించడం వల్ల మరింత స్పష్టంగా నేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.
చెడు ప్రభావాల మాటేమిటి?
యూట్యూబ్ పాఠాలు మంచివే అని అంటున్నా, దానివల్ల కలిగే చెడు ప్రభావాల మాటేమిటని విద్యావేత్తల ప్రశ్న. ఏదైనా అంశం గురించి చెప్పే వీడియోలను ఏ మేరకు నమ్మాలి, అందులోని అంశాలలో వాస్తవికత అనేది ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏది తప్పూ, ఏది ఒ΄్పో తెలియని చిన్నారులు వాటినే నమ్మితే రాబోయే కాలంలో అది ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. దీంతోపాటు యూట్యూబ్ అలవాటైన చిన్నారులకు బడి మీద అయిష్టత పెరుగుతుందని, రోజంతా నెట్‌లో గడిపేందుకు ఆసక్తి చూపుతారని అంటున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. పుస్తకాల్లో ఉన్నది చదవడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందని, అన్నీ కంటి ముందు చూపించే వీడియోల వల్ల వారు సొంత బుర్ర వాడటంలో శ్రద్ధ పెట్టలేకపోతున్నారని అంటున్నారు.
ఇలా చేస్తే మేలు..
→ ఏ ఛానెల్ అయితే మేలైన, నిజమైన కంటెంట్ అందిస్తుందో ముందుగా తల్లిదండ్రులు తనిఖీ చేయాలి. అందులోని పాత వీడియోలు, దాని కింద కామెంట్లు పరిశీలించాలి. అది నమ్మదగినది అనిపిస్తేనే పిల్లలకు చూపించాలి.
→ యూట్యూబ్ పాఠాలను కొందరు నిపుణులకు పంపి, అవి సరైనవని నిర్ధారణకు వచ్చాకే పిల్లలకు సూచించడం మరింత మేలు.
→ స్కూల్లో టీచర్లు చెప్పిన విషయాలు అర్థం కాలేదని పిల్లలు అంటే, ముందుగా ఆ విషయాలేమిటో తల్లిదండ్రులు కనుక్కోవాలి. దాని గురించి వారికి వివరించి, ఆ తర్వాత వారి పక్కనే కూర్చుని యూట్యూబ్ వీడియోలు చూడాలి. అందులోని చెప్పేదానికి తోడు మీరూ కొన్ని అంశాలు జతచేయాలి.
→ యూట్యూబ్ పాఠాలకు టైం కేటాయించాలి. ఎక్కువ సమయం పిల్లలు అవే చూడకుండా, వారికి ఇతర పనులూ కేటాయించాలి.
→ పిల్లలు ఏమేం వీడియోలు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు వంటి విషయాలు పెద్దలు గమనిస్తూ ఉండాలి.
→ కావాలని స్కూల్ మానేసి, పిల్లలు పాఠాల కోసం ఈ వీడియోల మీద ఆధారపడటాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు.
→ వీడియోల మధ్యలో సినిమాలు చూడటం, ఇతర అంశాలను చూడటం వంటివి పెద్దలు నిరోధించాలి.
→ వీడియోలు చూసి ఆగకుండా, అందులోని పాయింట్లను నోట్ చేసుకోమని సూచించాలి. వాటిని పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో సరిచూసుకోమని చెప్పాలి.
→ యూట్యూబ్‌లో చూపించిన అంశాల గురించి పిల్లలతో చర్చించాలి. అవి వారికి ఎలా అర్థమవుతున్నాయో అంచనా వేసి, మార్పుచేర్పులు చెప్పాలి.


