బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!
1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.
ఖజానా వివాదం..
అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్‌లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది.
అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు.
అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు.
విశేషం ఏంటంటే..
ఈ బృందావన్‌లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్‌లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్‌ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.
(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?)


